logo

కంకర తేలి.. దుమ్ము రేగి

మండల పరిధిలో గ్రామీణ రహదారులు అధ్వాన స్థితికి చేరుకొంటున్నాయి. ఏళ్ల తరబడి కనీస మరమ్మతులు కొరవడిన రోడ్లు గుంతలమయం కావడంతో.. వాహనదారులకు అసౌకర్యం తప్పడం లేదు.

Published : 27 Mar 2023 03:25 IST

గ్రామీణ రోడ్ల దుస్థితి.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

చెంగుబళ్ల వద్ద వాహనాలు వెళ్లే సందర్భంలో రేగుతున్న దుమ్ము

శాంతిపురం, న్యూస్‌టుడే: మండల పరిధిలో గ్రామీణ రహదారులు అధ్వాన స్థితికి చేరుకొంటున్నాయి. ఏళ్ల తరబడి కనీస మరమ్మతులు కొరవడిన రోడ్లు గుంతలమయం కావడంతో.. వాహనదారులకు అసౌకర్యం తప్పడం లేదు.

మరమ్మతులకు నోచుకోక

మండల వ్యాప్తంగా గ్రామీణ మార్గాలతోపాటు అంతరాష్ట్ర రహదారులు దుస్థితికి చేరుకొంటున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల కిందట నిర్మించిన బీటీ రోడ్లు గడచిన ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. కంకర తేలి.. మట్టి రోడ్లుగా మారడంతో.. వాహనాల రాకపోకల సందర్భంలో విపరీతమైన దుమ్ము రేగడంతో తీవ్ర అసౌకర్యం ఎదురవుతోందని జనం వాపోతున్నారు.

నిధుల కొరతే అవరోధం

ఏటా వర్షాకాలంలో దెబ్బతింటున్న రోడ్ల మరమ్మతులకు నిధుల కొరత ప్రధాన అవరోధంగా మారింది. గ్రామీణ మార్గాల్లోనూ భారీ వాహనాల రాకపోకల తీవ్రతకు రోడ్లు అధ్వాన స్థితికి చేరుకొంటున్నాయి. గ్రానైట్‌, కంకర, ఇసుక, మట్టి తరలింపు టిప్పర్ల వల్ల రోడ్ల అంచులు పాడైపోతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేనందున.. కనీస మరమ్మతులకు అవరోధం ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.


ఎక్కడెక్కడంటే

గొల్లపల్లె వద్ద దెబ్బతిన్న బీటీ రహదారి

* శాంతిపురం మండల కేంద్రం నుంచి కేజీఎఫ్‌ వెళ్లే మార్గాల్లో పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. చెంగుబళ్ల, బెండనకుప్పం, గొల్లపల్లె, 121- పెద్దూరు తదితర చోట్ల బీటీ రోడ్డు దెబ్బతింది. చెంగుబళ్ల వద్ద నాలుగేళ్ల కిందట హంద్రీ- నీవా కాలువ తవ్వకం కోసం రోడ్డును తవ్వేశారు. బీటీ నిర్మాణం చేపట్టకపోవడంతో.. మట్టి రోడ్డుపై విపరీతమైన దుమ్ము వల్ల అసౌకర్యం ఎదురవుతోందని వాహనదారులు వాపోతున్నారు.

* కుప్పం- పలమనేరు జాతీయ రహదారి నుంచి ఎంకేపురం, చిన్నగాండ్లపల్లె బీటీ రోడ్డు, సొన్నేగానిపల్లె మీదుగా దండికుప్పం వరకు రహదారిలో విపరీతమైన గుంతలు ఏర్పడటంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

* గెసికపల్లె కూడలి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు బీటీ రోడ్డు దుస్థితికి చేరుకొంది. పెద్దూరు నుంచి ముద్దనపల్లె మీదుగా గుడుపల్లె మండలంలోని దాసమానిపల్లె క్రాసు వరకు బీటీ రహదారి కంకర తేలి ముళ్లబాటను తలపిస్తోంది.

* కర్లగట్ట నుంచి సోమాపురం, దండికుప్పం మార్గం నుంచి కదిరిముత్తనపల్లె, గెల్లపల్లె క్రాసు నుంచి కోలాలతిమ్మనపల్లె, చిన్నారిదొడ్డి- రాళ్లబూదుగూరు మార్గం నుంచి కొత్తపేట మీదుగా శివకురుబూరు రోడ్డ దుస్థితికి చేరుకొంది. జాతీయ రహదారి నుంచి శ్యామరాజుపురం, వెదురుగుట్టపల్లె, మాదనపల్లె రోడ్లు కూడా కంకర తేలి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని