logo

నేటి నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు శ్రీరామనమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

Published : 30 Mar 2023 02:25 IST

తిరుపతి శ్రీకోదండరామస్వామి ఆలయానికి విద్యుత్‌ దీపాలతో అలంకరణ

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు శ్రీరామనమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 30న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. 31న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరగనుంది. ఏప్రిల్‌ 1న రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామునికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి.


నేడు శ్రీవారి ఆలయంలో ఆస్థానం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా జరుపుతారు. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవను తితిదే రద్దుచేసింది. శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.


సర్వదర్శనానికి ఎనిమిది గంటలు          

శ్రీవారి సర్వదర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి శ్రీవారి ధర్మదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు దాదాపు ఎనిమిది గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారిని 70,605 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.79 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని