logo

పరికరాలు మూలన.. సిబ్బంది బదిలీపైన

ప్రభుత్వ ఆసుపత్రిలో అతి ముఖ్యమైన హెచ్‌ఐవీ పరీక్ష కేంద్రంలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో అక్కడ సంబంధిత పరీక్షలు చేసేవారు లేకుండా రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు.

Published : 30 Mar 2023 02:23 IST

 ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తప్పని అవస్థలు

హెచ్‌ఐవీ పరీక్ష కేంద్రం

పలమనేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రిలో అతి ముఖ్యమైన హెచ్‌ఐవీ పరీక్ష కేంద్రంలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో అక్కడ సంబంధిత పరీక్షలు చేసేవారు లేకుండా రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ కేంద్రం దాదాపు ఇక్కడ మూతపడినట్టే. ఇక్కడున్న వ్యక్తి బదిలీ మీద బంగారుపాళ్యం వెళ్లిపోవడంతో ఆ పోస్టును ఇంకా భర్తీ చేయలేదు. సాధారణ ల్యాబ్‌ పరీక్షలైతే శిక్షణ పొందినవారు ఎవరైనా చేయవచ్చు. హెచ్‌ఐవీ కావడంతో సంబంధిత శిక్షకుడే చేయాలి. దాంతో ఆసుపత్రిలో పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. దాంతో ఆ కేంద్రం నిరంతరం ఖాళీగా దర్శనమిస్తుంటుంది. ఇక చిన్న పిల్లల వార్డులోని ముఖ్యమైన పరికరాలు మూలన పడ్డాయి.

ఫొటో థెరపీ పరికరం

ప్రతి గర్భిణికి అవసరం

ప్రతి గర్భిణీ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. ఎవరైనా దంపతులు, లేదా ప్రజలు ఇతర వ్యాధులకు సంబంధించి ఏదైనా సందేహాలున్నా ప్రభుత్వ ఆసుపత్రిలోనే హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా ఆసుపత్రిలో ఇందుకు సంబంధించి కౌన్సిలింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం పరీక్షలు నిర్వహించి హెచ్‌ఐవీ ఉంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్‌, 6 నెలలకు ఒకసారి సీడీ4 పరీక్షలు చేయాలి. తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ముఖ్యమైన పోస్టును భర్తీ చేయడకుండా వదిలేసింది. ఫలితంగా ఒకవైపు రోగులు, మరోవైపు కొత్తగా పరీక్షించుకోవాల్సిన వారికి ఇబ్బందులు తప్పటం లేదు.

మరమ్మతులకు గురవడంతో

ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డులో అత్యవసరమైన ఫొటో థెరపీ పరికరాలు మూడు పనిచేయడం లేదు. ఉన్నవి నాలుగైతే.. అందులో 3 ఒక్కసారిగా మరమ్మతులకు గురయ్యాయి. చిన్న పిల్లలు పుట్టిన వెంటనే జాండిస్‌ వస్తుందని లేదా వచ్చిన తరువాత ఈ పరికరంలో ఉంచుతారు. ఇవి ఇప్పుడు పనిచేయకపోవడంతో పిల్లలను తీసుకుని చిత్తూరుకు పోవాల్సి వస్తోంది. అధికారులు ఇలాంటి అత్యవసరమైన వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినవస్తున్నాయి.


ఉన్నతాధికారులకు నివేదించాం

హరగోపాల్‌, వైద్యాధికారి, ప్రభుత్వాసుపత్రి, పలమనేరు

హెచ్‌ఐవీ పరీక్ష కేంద్రంలోని ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులకు సమాచారాన్ని తెలియచేశాం. ఇక ఫొటో థెరఫి పరికరాలను మరమ్మతు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని