logo

పగిలిన గొట్టాలు.. దెబ్బతిన్న వాల్వులు

మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పథకాలకు సంబంధించి పైపులు పగిలి తాగునీరు రోడ్డు పాలవుతోంది. దీనికితోడు కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి.

Published : 30 Mar 2023 02:22 IST

సరఫరాలోనే పెద్దఎత్తున వృథా

కోట ఎస్సీ గురుకుల కళాశాల సమీపంలో పైప్‌లైన్‌ లీకేజీ

కోట, న్యూస్‌టుడే : మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పథకాలకు సంబంధించి పైపులు పగిలి తాగునీరు రోడ్డు పాలవుతోంది. దీనికితోడు కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. గేట్‌ వాల్వులు దెబ్బతిని 25 % వరకు వృథా అవుతోంది. తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉండగా ఏళ్లతరబడి ప్రతిపాదనలతోనే కాలయాపన చేస్తున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో తాగునీటి ఎద్దడి, అతిసారం వంటి వ్యాధులు ప్రబలకముందే అధికారులు స్పందించాల్సి ఉంది.

కోట మండలం వెంకన్నపాళెం సమీపంలో వాకాడు స్వర్ణముఖినది దగ్గర సీపీడబ్ల్యూ పథకం పైపులైన్‌కు ఏర్పాటు చేసిన గేట్‌వాల్వు నుంచి తాగునీరు పెద్దఎత్తున వృథా అవుతోంది. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కోట ఎస్సీ గురుకుల కళాశాల మార్గంలో పంచాయతీ పైపులైన్‌ పగిలిపోయింది. వృథా తోడు తాగునీరు కలుషితమవుతోంది.

వాకాడు మండలంలో 36 రక్షత మంచినీటి పథకాలున్నాయి. సీపీడబ్ల్యూఎస్‌ పథకం ఒకటి ఉంది. 5 గేట్‌వాల్వులు దెబ్బతినగా 8 ప్రాంతాల్లో పైపులైన్లు పగిలి తాగునీరు వృథాగా పోతోంది.

చిట్టమూరు మండలంలో 23 రక్షిత మంచినీటి పథకాలు, మూడు సీపీడబ్ల్యూఎస్‌ స్కీములున్నాయి. 15 చోట్ల గేట్‌వాల్వులు దెబ్బతిని, పది చోట్ల పైపులైన్లు పగిలాయి. ప్రధానంగా తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితులున్నాయి.

వెంకన్నపాళెం సమీపంలోని గేట్‌వాల్వు నుంచి వృథా

సమస్యలు ఇలా..

కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 102 రక్షత మంచినీటి పథకాలు, 6 సీపీడబ్ల్యూ పథకాల ద్వారా 200 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. కోట మండలంలో 43 రక్షత మంచినీటి పథకాలు, 2 సీపీడబ్ల్యూ స్కీములున్నాయి. వీటికి గూడలి, వాకాడు పరిధిలోని స్వర్ణముఖి నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు. గేట్‌వాల్వులు 20 వరకు దెబ్బతినగా పదిచోట్ల పైపులైన్లు పగిలాయి.


రూ.50 లక్షలతో ప్రతిపాదనలు

-నందకుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

సీపీడబ్ల్యూఎస్‌ గేట్‌ వాల్వుల మరమ్మతులకు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేస్తాం. రక్షత మంచినీటి పథకాల గేట్‌వాల్వులు, పైపులైన్లకు పంచాయతీ నిధులతో మరమ్మతులు చేయిస్తాం. వృథాను అరికట్టి వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని