logo

చిరు వ్యాపారం.. కుటుంబానికి ఆదాయం

గాంధీపురం పంచాయతీలోని పలువురు మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉంటూ రుణాలు పొంది చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.

Published : 30 Mar 2023 02:22 IST

తిరుపతి (గ్రామీణ), చంద్రగిరి, న్యూస్‌టుడే: గాంధీపురం పంచాయతీలోని పలువురు మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉంటూ రుణాలు పొంది చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉపాధి బాటలో ముందుకు సాగుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.


పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తూ..

నా పేరు సరళ. భర్త దయాల్‌ ఎలక్ట్రికల్‌ పనులు చేస్తారు. ఒక్కరి సంపాదనతో ఇద్దరు పిల్లల్ని చదివించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో 2010లో పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరాను. రూ.లక్ష రుణం తీసుకుని మాస్‌ సంస్థ సహకారంతో చిల్లర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నా. ప్రతి నెలా ఈ దుకాణం ద్వారా సుమారు రూ.16 వేలు సంపాదిస్తున్నాను. దీంతో కొంతమేర ఆర్థికంగా ఇబ్బందులు తీరాయి. మా అమ్మాయి అగ్రికల్చరల్‌ డిగ్రీ, అబ్బాయి బీటెక్‌ చదువుతున్నారు.


ఇల్లు నిర్మించుకున్నాం

నా పేరు సంగీత. నా భర్త రమేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక్కరి సంపాదనతో వారిని ఉన్నత చదువులు చదివించాలంటే కష్టమే. ఈ క్రమంలోనే 2010లో సంగీత మాత పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరా. రూ.1.50 లక్షల రుణం తీసుకుని ఫ్యాన్సీ దుకాణం ఏర్పాటు చేసుకున్నా. నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాను. ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు తీరడంతో ఒక ఇల్లు నిర్మించుకున్నాం. అమ్మాయి ఎస్వీయూలో ఎమ్మెస్సీ చదువుతోంది. అబ్బాయి బీటెక్‌ చదువుతున్నాడు.


పండ్ల వ్యాపారంతో లాభాలు

నా పేరు లావణ్య. చంద్రగిరి మండలం కొత్తపేటలోని భారతీనగర్‌. నా భర్త శివకుమార్‌ తిరుపతిలో టాక్సీ డ్రైవరుగా పనిచేస్తారు. ఆయన సంపాదన సరిపోవడం లేదు. నేను మూడేళ్ల క్రితం శ్రీకృష్ణమహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి తొలుత రూ.50 వేలు రుణ సదుపాయం పొంది చంద్రగిరి బస్టాండు ప్రాతంలో నాలుగుచక్రాల తోపుడుబండిపై పండ్లవ్యాపారం మొదలుపెట్టా. సీజన్‌కు అనుగుణంగా లభించే వివిధ రకాల పండ్లు విక్రయిస్తున్నా. రోజుకు ఖర్చులు పోనూ రూ.600 వరకు వస్తోంది. దీంతో సంఘంలో తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తూ మరో మారు రూ.లక్ష రుణం పొంది ముగ్గురు పిల్లలను చదివిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని