logo

అంతా రామమయం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.

Published : 31 Mar 2023 02:38 IST

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. సాయంత్రం ఆస్థానం చేపట్టారు. రాత్రికి శ్రీరామచంద్రమూర్తి.. హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తితిదే పానకం, వడపప్పు నిరంతరాయంగా పంపిణీ చేసింది.  రామకోటి రాసేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామివారి సేవలో తిరుపతి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శిరీష్‌, కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్‌, సూపరింటెండెంట్ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు కల్యాణం

శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తితిదే పరిపాలనా భవనం నుంచి గజరాజు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీˆతారామ కల్యాణం జరగనుంది. ఇందులో పాల్గొనే గృహస్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.


రమణీయం.. సీతారాముల పరిణయం

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయంలో కొలువుదీరిన సీతారాముల ఉత్సవమూర్తులకు గురువారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కల్యాణం కమనీయంగా సాగింది. కల్యాణానికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రిని స్థానిక ఎమ్మెల్యే బాబు, ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి దంపతులు ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఆలయ కల్యాణ వేదిక ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో సీతారాములు, లక్ష్మణ, హనుమంత స్వాముల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవ నిర్వహిం చారు. ప్రత్యేక పుష్పాలంకరణ చేసి కల్యాణోత్సవం జరిపించారు. సీతారాముల ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు సమర్పించి, కంకణధారణ గావించారు. భక్తులు వీక్షిస్తుండగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకుడు అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని