logo

యువికా.. అంతరిక్ష కలల వేదిక

ఈ విశ్వం నిగూఢ రహస్యాల అనంత నిధి.. ఎందుకు.. ఎలా.. అన్న కుతూహలమే దాన్ని ఛేదించే ఏకైక ఆయుధం. విద్యార్థిదశలోనే ప్రతిభగల చిన్నారులను గుర్తించి వారికి అంతరిక్ష సాంకేతికత, పరిజ్ఞానం, అనువర్తనాలపై అవగాహన కల్పించి భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది.

Published : 31 Mar 2023 02:38 IST

ఇస్రో ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
నమోదుకు ఏప్రిల్‌ 3 ఆఖరు తేదీ

శ్రీహరికోట: ఈ విశ్వం నిగూఢ రహస్యాల అనంత నిధి.. ఎందుకు.. ఎలా.. అన్న కుతూహలమే దాన్ని ఛేదించే ఏకైక ఆయుధం. విద్యార్థిదశలోనే ప్రతిభగల చిన్నారులను గుర్తించి వారికి అంతరిక్ష సాంకేతికత, పరిజ్ఞానం, అనువర్తనాలపై అవగాహన కల్పించి భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా-2023) పేరుతో ఇస్రో ‘యువ శాస్త్రవేత్తల’ కార్యక్రమానికి 2019లో శ్రీకారం చుట్టింది. అప్పటి ఇస్రో అధిపతి డా.శివన్‌ ‘సంవాద్‌ విత్‌ స్టూడెంట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమమే నాసా నిర్వహిస్తోంది. ఇదే తరహాలోనే ఇస్రో దేశంలోని గ్రామీణ విద్యార్థులు సైన్సు పట్ల ఆకర్షితులయ్యేలా... సంబంధిత రంగాల్లో వారిని నిష్ణాతులుగా తయారు చేయడమే యువికా లక్ష్యం. ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు రెండువారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.

రెండు జిల్లాల విద్యార్థులకు అవకాశం

చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ ఏడాది ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి, 9వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు ఇందుకు అర్హులు. ఇందులో తిరుపతి జిల్లాలో 18,920, చిత్తూరు జిల్లాలో 18,253 మంది ఉన్నారు. వీరందరికీ యువికా ఓ సువర్ణావకాశం. ఇస్రో అధిపతితో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

దేశ వ్యాప్తంగా 120 మంది విద్యార్థులను యువికా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేలా ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. 2023-24లో తొమ్మిదో తరగతి చదువనున్న విద్యార్థులను ఎంపిక చేస్తారు. కార్యక్రమానికి ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేస్తారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌ చదివే విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. ఇస్రోలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించి, సీనియర్‌ శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. విద్యార్థులకు అవసరమైన పరిశోధన, ఉపగ్రహాల తయారీపై ఆచరణాత్మక(ప్రాక్టికల్‌) అనుభవాన్ని పెంపొందిస్తారు. విద్యార్థుల పూర్తి ఖర్చులను ఇస్రోనే భరిస్తుంది. వసతి, భోజనం కల్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని