logo

పశుగ్రాసం కొరత.. పాడి రైతుల దీనావస్థ

ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే పశుగ్రాసం కొరత పాడి రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పాడి పరిశ్రమకు నిలయమైన పడమటి మండలాల్లో గ్రాసం కొరత తీవ్రం కావడంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు.

Updated : 31 Mar 2023 03:38 IST

వేసవి ఆరంభంలోనే సమస్య తీవ్రం
న్యూస్‌టుడే, కుప్పం, శాంతిపురం

నెల్లూరు నుంచి ప్రైవేటు వ్యాపారి తీసుకొచ్చిన గడ్డిని కొనుగోలు చేస్తున్న మహిళా పాడి రైతు నాగమ్మ

ఏడాది వేసవి ఆరంభంలోనే పశుగ్రాసం కొరత పాడి రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పాడి పరిశ్రమకు నిలయమైన పడమటి మండలాల్లో గ్రాసం కొరత తీవ్రం కావడంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. పంటల సాగులో సింహభాగం కూరగాయుల, పూలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. తద్వారా పశువులకు నామమాత్రంగానే గ్రాసం లభిస్తోంది. ఉద్యాన పంటలకు విపరీతంగా క్రిమి సంహారక మందులను వినియోగిస్తున్న పరిస్థితుల్లో పంటల ఒబ్బిడి అనంతరం పైర్లను మూగజీవాలకు ఆహారంగా వినియోగించలేని స్థితి.

వ్యవసాయేతర కుటుంబాలకు ఇబ్బందులు: కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల వరకు పశువులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సాగునీటి ఆధారిత సేద్యం కలిగిన రైతులు అరకొరగా గ్రాసం సాగు చేపడుతుండగా.. వారితోపాటు వ్యవసాయేతర పాడి రైతులు పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారు. గ్రాసం లభించని పరిస్థితుల్లో వ్యాపారస్థులపై ఆధారపడుతున్నారు.* గడ్డి కట్టకు రూ.250 ఇవ్వాల్సిందే..: జిల్లాలోని పశ్చిమ మండలాల్లో గ్రాసం కొరతను గుర్తించిన వ్యాపారస్థులు కోస్తా ప్రాంతం నుంచి గడ్డిని లారీల్లో తీసుకొచ్చి ఇంటింటా విక్రయాలు చేపడుతున్నారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన వరి గడ్డి కట్టలను ఇక్కడ రూ.250 వంతున విక్రయిస్తున్నారు. గత ఏడాది రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.50 పెరిగినట్లు రైతులు చెబుతున్నారు.


శాంతిపురం మండలం గుంజార్లపల్లె పంచాయతీ కరేగౌనివూరుకు చెందిన రైతు రాధాక్రిష్ణ ఉద్యాన పంటల సాగుతోపాటు పశుపోషణను  జీవనాధారంగా మలుచుకున్నారు. ఏడు ఆవులను పోషిస్తున్న ఈ రైతుకు పశుగ్రాసం సమస్య ఆందోళన కలిగిస్తోంది. నెలకు రూ.10 వేలకు పైబడి దీనికి వెచ్చించాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు తీసుకొచ్చే వరిగడ్డిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నట్లు వాపోయారు. ఇలాంటి పరిస్థితినే పశ్చిమ ప్రాంతంలో వేలాది మంది పాడి రైతులు ఎదుర్కొంటున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి: పాడితో జీవనాలను సాగిస్తున్న మాలాంటి పేద రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి. వేసవిలో అయినా ఉచితంగా గ్రాసం పంపిణీ చేయాలి.

శీతప్ప, రైతు, కేజీపల్లె, శాంతిపురం మండలం



ప్రభుత్వం ఆదేశించిన వెంటనే నివేదిస్తాం: పశుగ్రాసం కొరత నివారణ చర్యల విషయంగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఆదేశాలు అందాక క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రత గుర్తించి నివేదిక పంపుతాం.

మోహన్‌ రవికుమార్‌, పశుసంవర్ధకశాఖ ఏడీ, పలమనేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని