logo

సామాన్యులకు భారంగా రైలు ప్రయాణం

కొవిడ్‌ సమయంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్యాసింజర్‌ రైళ్లను తిరిగి ప్రారంభించలేదు. ప్రస్తుతం వాటి స్థానంలో ఎక్స్‌ప్రెస్‌లను నడపడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 31 Mar 2023 02:33 IST

ప్యాసింజర్ల స్థానంలో ఎక్స్‌ప్రెస్‌లు
న్యూస్‌టుడే, తిరుపతి(రైల్వే)

కొవిడ్‌ సమయంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్యాసింజర్‌ రైళ్లను తిరిగి ప్రారంభించలేదు. ప్రస్తుతం వాటి స్థానంలో ఎక్స్‌ప్రెస్‌లను నడపడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతికి పర్యాటకులతో పాటు సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వస్తుంటారు.

దూరప్రాంతాల  పర్యాటకులు, ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు ముందస్తు ప్రణాళికలో భాగంగా రిజర్వేషన్‌ చేసుకోవడం, టికెట్‌ ఖరారు కానీ పక్షంలో జనరల్‌ టికెట్‌తో ప్రయాణం చేయాల్సి వస్తోంది. కాగా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి తిరుపతికి రోజువారీ రాకపోకలు సాగించే కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఆస్పత్రులకు వచ్చే రోగులకు గతంలో నడిచే ప్యాసింజర్‌ రైళ్లు అనుకూలంగా ఉండేవి. అరక్కోణం నుంచి వచ్చే రైలు ద్వారా నగరి, పుత్తూరు ప్రాంతాలకు చెందిన వారికి.. నెల్లూరు నుంచి వచ్చే మెము ద్వారా గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు ప్రాంతాల నుంచి వచ్చేవారికి సౌకర్యవంతంగా ఉండేది. అలాగే తిరుపతి నుంచి కాట్పాడికి వెళ్లే రైళ్లలో పాకాల, పూతలపట్టు, చిత్తూరు కలెక్టరేట్‌కి వెళ్లే వారు నిత్యం రాకపోకలు సాగించేవారు. అందరికి అందుబాటులో ఉన్న ప్యాసింజర్‌ రైళ్లను కొవిడ్‌ కారణంగా ద.మ.రైల్వే రద్దు చేసింది. ప్రస్తుతం గుంటూరు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి మీదుగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల్లే నడుస్తున్నాయి. కాట్పాడి మార్గంలోనే ప్యాసింజర్‌ రైలును పునరుద్ధరించి ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. కాట్పాడి మార్గంలో అన్ని స్టాపింగ్‌లు ఉన్నా టికెట్‌ ధరను 5 నుంచి 10 శాతం వరకు పెంచడంతో సాధారణ ప్రయాణికులకు భారం తప్పడం లేదు. నెల్లూరు, గూడూరు రైళ్ల ఊసే లేదు. గతంలో కాకినాడ నుంచి తిరుపతికి... ఇక్కడి నుంచి కాకినాడకు ప్యాసింజరు రైలు ఉండేది. ఇది తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేది. దాన్ని ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ద.మ.రైల్వే ఉన్నతాధికారులు స్పందించి నెల్లూరు, గూడూరు, కాకినాడు రైళ్లను పునరుద్ధరించి, కాట్పాడి మార్గంలో టికెట్‌ ధరను తగ్గిస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయ పడుతున్నారు.


వీటి ఊసే లేదు

తిరుపతి- అరక్కోణం (66022), తిరుపతి- గూడూరు (67237), తిరుపతి- నెల్లూరు (66033) రైళ్ల (నాట్‌ రిన్నింగ్‌ స్టేటస్‌) ఊసే లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని