logo

తిరువైభవం.. ఆకట్టుకున్న సంబరం

నవ్యత.. సాంకేతికత మేళింపుగా ఆటలు, పాటలు, పరిశోధనలు, చిత్ర, విచిత్రమైన సంబరాలకు ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ వేదికగా నిలిచింది.

Updated : 01 Apr 2023 05:31 IST

తిరుపతి ఐఐటీలో కల్చరల్‌ ఫెస్ట్‌ ప్రారంభం
మొదటి రోజు నృత్య ప్రదర్శనలు, వంటల తయారీ

విద్యుత్తు కాంతుల్లో ఐఐటీ ప్రాంగణం

ఏర్పేడు, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: నవ్యత.. సాంకేతికత మేళింపుగా ఆటలు, పాటలు, పరిశోధనలు, చిత్ర, విచిత్రమైన సంబరాలకు ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ వేదికగా నిలిచింది. ‘తిరుఉత్సవ్‌- 2023’ కార్యక్రమాలు ఇక్కడి ప్రాంగణంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పలు విద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఐఐటీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.  అందరూ కలిసి వేడుక నిర్వహణలో భాగస్వాములయ్యారు. పలు ఈవెంట్లను  విద్యార్థులు  ప్రణాళిక నిర్వహించారు. గతేడాది ఈగల్‌ను తిరుఉత్సవ్‌ సూచికగా సిద్ధం చేస్తే.. ఈ దఫా స్థానికతకు అవకాశం ఇస్తూ తిరుమల శేషచల అడవుల్లో సంచరించే నాలుగు కొమ్ముల జింకను సూచికగా ప్రదర్శించారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులు దారాలతో సూచిక  రూపొందించి ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. మూడు రోజుల తిరుఉత్సవ్‌లో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఉత్సవాన్ని ప్రారంభిస్తున్న ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎన్‌ సత్యనారాయణ, జగదీష్‌, షీలా

సాంకేతిక, సాంస్కృతిక నైపుణ్యాల మేళవింపు

విద్యార్థుల్లోని సాంకేతిక, సాంస్కృతిక నైపుణ్యాలు ప్రదర్శించేందుకు ‘తిరుఉత్సవ్‌’ దోహదపడుతుందని ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎన్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ‘తిరుఉత్సవ్‌-23’ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు.  పారిశ్రామిక, వ్యాపారవేత్తల సహకారంతో ఈ ఏడాది రూ.30    లక్షలతో కార్యక్రమం జరుగుతుందని, విజేతలకు రూ.2.50లక్షల నగదు బహుమతి అందజేస్తామన్నారు.  ఐఐటీ ఏర్పడినప్పటి నుంచి సహకారం అందిస్తున్న అమరరాజ పరిశ్రమ సేవలను కొనియాడారు. అనంతరం అమరరాజ బ్యాటరీస్‌ న్యూ ఎనర్జీ స్టోరేజ్‌ చీఫ్‌ టెక్నికల్‌ అధికారి జగదీష్‌, క్రిండల్‌ ప్రిన్సిపల్‌ డేటా సైంటిస్ట్‌ షీలా మాట్లాడారు. విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య వెంకయ్య పాల్గొన్నారు.

గానంతో అలరిస్తున్న విద్యార్థులు

వన్‌ ఆన్‌లో యువత కేరింత..  

సంప్రదాయ నృత్యమే కాకుండా, రాక్‌ డ్యాన్స్‌లతో విద్యార్థులు అద్భుతమైన  ప్రదర్శనలు చేశారు. ‘వన్‌ ఆన్‌’.. పేరుతో ఏర్పాటు చేసిన నృత్య పోటీల్లో పలువురు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వారిని ప్రోత్సహిస్తూ విద్యార్థుల కేరింతలతో ప్రాంగణమంతా సందడి నెలకొంది.

నృత్య ప్రదర్శన

ఒక్కొక్కటీ.. అద్భుతమే..

ఈ దఫా తిరుఉత్సవ్‌కు వచ్చిన వారిని ఆకట్టుకునేలా విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు మరింత ఆకర్షణగా నిలిచాయి. వీటిలో మచ్చుకు కొన్ని.. సినిమా అడ్మిట్‌ వన్‌, వాంటెడ్‌ ఫొటో ఫ్రేమ్‌, సినిమా డెకరేషన్లు ఉన్నాయి. పాతతరం సీడీలు, మ్యూజిక్‌ ప్లేయర్ల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆహా.. ఏమి రుచి..: సంబరాల్లో భాగంగా ‘లీ చెఫ్‌’ పేరుతో వంట తయారీ పోటీలు ప్రారంభించారు. చదువులో ప్రతిభ చాటే విద్యార్థులు పాకశాస్త్ర ప్రావీణ్యులుగా మారి అద్భుత వంటకాలు తయారు చేశారు. దోశ పోయడం తెలుసు.. పాయసం చేయడం వచ్చు అంటూ.. రకరకాల వంటకాలు తయారు చేసి పోటీలు పడ్డారు. పోషకాలు అందించే వెన్న, పాలు, తాజా పండ్లతో పలువురు సలాడ్లు తయారు చేసి ప్రదర్శించారు. వాటిని నిపుణులు వాటిని పరిశీలించి మార్కులు వేశారు.

తిరుఉత్సవ చిహ్నం

ఆకట్టుకున్న చిత్ర ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని