logo

రూ.40 లక్షలతో కొనుగోలు.. నాలుగేళ్లుగా మూలకు...

స్థానిక మార్కెట్‌ యార్డులో మామిడి కాయలను నిల్వ ఉంచేందుకు నిర్మించిన శీతల గిడ్డంగి నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు.

Updated : 01 Apr 2023 05:25 IST

శీతల గిడ్డంగిపై శీతకన్ను
మరమ్మతులు చేయిస్తే మామిడి రైతులకు ప్రయోజనం

అలంకారప్రాయంగా శీతలగిడ్డంగి

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: స్థానిక మార్కెట్‌ యార్డులో మామిడి కాయలను నిల్వ ఉంచేందుకు నిర్మించిన శీతల గిడ్డంగి నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీనిని వినియోగంలోకి తీసుకురావాలని మామిడి రైతులు కోరుతున్నా పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్‌ యార్డు పరిధిలోని బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె, యాదమరి మండలాల రైతులు మామిడి కాయలను నిల్వ ఉంచడానికి వసతి లేక పంటను తక్కువ ధరలకు విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

నాలుగేళ్ల క్రితం సుమారు రూ.40 లక్షల వ్యయంతో 20 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన శీతల గిడ్డంగి మార్కెట్‌ యార్డులో అలంకారప్రాయంగా ఉంది. యార్డులో దీనిని అమర్చిన వారం రోజులకే మరమ్మతులకు గురైంది. మనం ఓ పెద్ద వస్తువును కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై ఆరా తీస్తాం. కానీ అధికారులు ప్రభుత్వ సొమ్మే కదా అనుకున్నారో ఏమో.. నాణ్యతను పరిశీలించకుండా నాసిరకం సామగ్రిని కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో శీతల గిడ్డంగి అమర్చిన వారం రోజులకే మూలన పడింది.

నిల్వ దేవుడెరుగు

మార్కెట్‌లో మామిడి కాయల ధర తగ్గినప్పుడు రైతులు ఆ కాయలను శీతల గిడ్డంగిలో నిల్వ ఉంచుకొని ధరలు పెరిగినప్పుడు అమ్ముకునేందుకు నిర్మించిన గిడ్డంగిని రైతులు వినియోగించుకున్న దాఖలాలు లేవు. బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి కాయల సీజన్‌ మూడు నెలల పాటు కొనాసాగుతుంది. రాత్రింబవళ్లు  రూ.కోట్ల విలువైన వ్యాపారాలు జరుగుతాయి. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, రాజస్థాన్‌, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. జిల్లాలోని బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె, యాదమరి, పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, వికోట, చిత్తూరు, గుడిపాల, పూతలపట్టు, గంగాధరనెల్లూరు మండలాల రైతులు రైతులు మామిడిపంటను లారీలు, ట్రాక్టర్లు, టాటాఏస్‌, ఆటోల్లో  మార్కెట్‌యార్డుకు తీసుకొస్తుంటారు. మామిడిగుజ్జు పరిశ్రమలకు మామిడి కాయలను తరలిస్తుంటారు. శీతల గిడ్డంగిని మరమ్మతులు చేయాలని మార్కెట్‌ కమిటీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని పర్యవేక్షకులు గంగయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని