logo

ముందుకు సాగని ఆధునికీకరణ పనులు

జలవనరుల శాఖ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. చేసిన పనులకు బిల్లులు రాని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు.

Updated : 01 Apr 2023 05:35 IST

బకాయిలు రూ.20 కోట్ల పైనే
మూడేళ్లుగా కొనసాగుతున్న వైనం

అసంపూర్తిగా పాలచ్చూరు ప్రధాన కాలువ

గూడూరు, న్యూస్‌టుడే: జలవనరుల శాఖ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. చేసిన పనులకు బిల్లులు రాని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు. 2019-20లో నియోజకవర్గంలోని నాలుగు పనులకు రూ.కోట్లలో నిధులు విడుదలయ్యాయి. అప్పట్లో జలవనరుల శాఖ మంత్రి అనీల్‌ ఇక్కడ పర్యటించి స్థానిక శాసన సభ్యులు సంజీవయ్య సూచనతో నిధులు మంజూరు చేశారు. దీంతో కాలువ అధునికీకరణకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారు. ఇలా తొలి దశలో పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల బకాయిలు ఉండటంతో ఎక్కడ పనులు అక్కడే ఆపేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లోనైనా బిల్లులు వస్తాయన్న ఆశతో ఉన్న వారికి నిరాశే మిగిలింది. ఈ ప్రభావం పనులు మీదు పడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

* గూడూరు ఇరిగేషన్‌ డివిజన్‌ సూళ్లూరుపేట నియోజకవర్గంలో 4 పనులకు గాను రూ.71.54 కోట్లు విడుదలైయ్యాయి. అప్పట్లోనే టెండర్లు పిలవడంతో మూడు పనులు మొదలు పెట్టారు. కాళంగి మీద గ్రాయిన్‌ పనులకు గుత్తేదారులు ముందుకు రాకపోవంతో అంచనాలు మార్చి మళ్లీ టెండర్‌లు పిలిచారు. ప్రస్తుతం చేపట్టిన పనులు బిల్లులు సుమారుగా రూ.20 కోట్ల రావాల్సి ఉండటంతో గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. పాలచ్చూరు ట్యాంక్‌ సిస్టమ్‌ అధునికీకరణ పనులకు రూ.31.65 కోట్లు మంజూరు చేశారు. పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాలు మీదగా 23కి.మీ మేర కాలువకు కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. గుత్తేదారుకు సుమారుగా రూ.16 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలిసింది. సదరు పని పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో 5 కి.మీ కాంక్రీట్‌ పూర్తి చేశారు. కాలువల్లో పూడిక తొలగించడం అక్కడక్కడ కొన్నిచోట్ల చిన్న వంతెనులు పూర్తి కాగా బిల్లులు ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు.

* దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ప్రవహించే నెర్రి కాలువ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఈ కాలువ అధునికీకరణకు రూ.27.19 కోట్లు విడుదలైయ్యాయి. దొరవారిసత్రం మండలంలో సుమారుగా కి.మీ మేర పని చేశారు. సూళ్లూరుపేటలో రూ.5 కోట్ల మేర పనులు చేపట్టారు. పూర్తయిన పనులకు గాను రూ.2.50 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. ఈ పనులు ఎక్కడి కక్కడే ఆగిపోయాయి. నెర్రి కాలువ ద్వారా మూడు మండలాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే అవకాశముంది. రైతులు ఎంతో కాలంగా ఆక్రమణలకు గురికావడం, పూడికతో ఇబ్బంది పడేవారు. అధునికీకరణతో అవస్థలు తీరుతాయన్న ఆశతో ఉండగా బిల్లుల గండం గుదిబండగా మారింది.

* తడ మండలం ఎన్‌ఎమ్‌ కండ్రిగ దగ్గర పాముల కాలువ ఆనకట్టకు రూ.3.96 కోట్లు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసి ఇక్కడ 50 శాతం మేర పనులు పూర్తి చేశారు. పనులు చేసిన గుత్తేదారుకు రూ.1.89 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో గుత్తేదారులు పనులు చేపట్టడానికి ముందుకు రావడంలేదు. ఇలా ఇక్కడ రైతుల ఆశలు అడియాసలుగా మారాయి. ఏటా వరదల సమయంలో ఇక్కడ కలుజు కొట్టుకు పోయే పరిస్థితి కాగా దానిని శాశ్వత పద్ధతిలో చేపట్టడానికి నిధులు మంజూరు కాగా ఆపనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇదే మండలం వాటంబేడు దగ్గర కాళంగి నదిపై గ్రాయిన్‌ నిర్మించడానికి రూ.8.28 కోట్లు విడుదల చేసి రెండు దఫాలు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందు రాలేదు. తాజాగా అంచనాలు పెంచి మళ్లీ టెండర్లు పిలిచిన జలవనరుల శాఖ ఏప్రిల్‌ ఆఖరులో పనులు అప్పగించనుంది. ఇలా మూడేళ్లుగా జలవనరుల శాఖ పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందు రాని పరిస్థితి నెలకొంది.


బిల్లులు రాగానే మళ్లీ పనులు మొదలు

చేపట్టిన పనులకు బిల్లులు పంపించాం. బకాయిలు ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. బిల్లులు రాగానే మళ్లీ పనులు పారంభించి పూర్తి చేస్తాం. 

సురేష్‌బాబు, కార్యనిర్వాహక ఇంజినీర్‌, జలవనరుల శాఖ, గూడూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని