logo

అన్నీ చేసినా వీధుల్లోనే చెత్త

ఇంటింటా చెత్త సేకరణ అని ప్రకటించాం.. ప్రతి ఇంటికి చెత్త బుట్టలు అందజేశాం.. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని చెప్పాం.

Published : 01 Apr 2023 03:09 IST

ప్రశ్నలకు సమాధానమిస్తున్న కమిషనర్‌ నరేంద్రకుమార్‌, పక్కన ఛైర్మన్‌ శ్రీమంత్‌

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ఇంటింటా చెత్త సేకరణ అని ప్రకటించాం.. ప్రతి ఇంటికి చెత్త బుట్టలు అందజేశాం.. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని చెప్పాం. దీనిపై పలుమార్లు అవగాహన కల్పించాం.. విస్తృతంగా ప్రచారం చేశాం.. అయినా ఎపుడు రద్దీగా ఉండే బజారు వీధుల్లోనే చెత్తకుప్పలు కనిపిస్తున్నాయంటూ అధికార హోదా సభ్యుడు కళత్తూరు సునీల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సూళ్లూరుపేట పురపాలక సంఘ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం స్థానిక స్త్రీశక్తి భవన్‌లో ఛైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ బజారు వీధుల్లో నిత్యమూ పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారని, అయినా దుకాణాదారులు, గృహ యజమానులు ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు వేస్తున్నారని, దీంతో వీధుల్లో అపరిశుభ్రత తాడవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు మేడల పైనుంచి చెత్తను కవర్లలో నింపి బజారు వీధుల్లోకి విసిరివేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దీనిపై పురపాలక సిబ్బంది స్పందించి, బజారు వీధుల్లో చెత్త వేసే వారికి జరిమానా విధించాలని సూచించారు. ఇంకా పలు అంశాలపై సభ్యులు ప్రశ్నించారు. వివిధ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ తీర్మానం చేసింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యాన తాగునీటి పైపులైన్లు వేస్తున్నామని ఏఈ భరత్‌కుమార్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని