logo

Jagan Mohan Reddy: బ్రిటిషోళ్లదో సర్వే.. జగనన్నదో సర్వేనా!

భూములను సమగ్ర సర్వే చేసి ప్రతి రైతుకు భూహక్కు పత్రాలను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న భూరక్ష’ పేరుతో రీసర్వేకు శ్రీకారం చుట్టింది.

Updated : 02 May 2023 09:43 IST

శాటిలైట్‌ చిత్రాలతో పనులు
రాళ్లను నాటొద్దని అధికారులను అడ్డుకుంటున్న అన్నదాతలు
ఇదీ కుప్పంలో పరిస్థితి

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ పక్కన వైకాపా నాయకుడి పొలంలో పడి ఉన్న సర్వే రాయి

కుప్పం గ్రామీణ: భూములను సమగ్ర సర్వే చేసి ప్రతి రైతుకు భూహక్కు పత్రాలను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న భూరక్ష’ పేరుతో రీసర్వేకు శ్రీకారం చుట్టింది. తద్వారా మేలు చేకూరుతుందని రైతులంతా భావించారు. తీరా శాటిలైట్‌ చిత్రాలతో రీసర్వే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రాళ్లు నాటేందుకు పొలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు రైతుల నుంచి చుక్కెదురవుతోంది. గతంలో ఉన్న సర్వేరాళ్లకు.. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం శాటిలైట్‌ సర్వే ద్వారా నాటే సర్వే రాళ్ల మధ్య వ్యత్యాసం ఉండటంతో అడుగడుగునా రైతులు నాటేందుకు నిరాకరిస్తున్నారు. బ్రిటిషోళ్లదో సర్వే.. జగనన్నదో సర్వేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒత్తిడా..? వైఫల్యమా..? 

అధికారుల ఒత్తిడో లేక ప్రభుత్వ వైఫల్యమోగాని కుప్పం మండలం ములకలపల్లె గ్రామంలో రెవెన్యూ అధికారులు బలవంతంగా సర్వేరాళ్లు నాటినా వాటిని రైతులు పెకలించడమే కాదు.. ధ్వంసం చేస్తున్నారు. కుప్పం మండలం పెద్దబంగారునత్తం రెవెన్యూలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ వద్ద అనిమిగానిపల్లెకు చెందిన ఓ వైకాపా నేత తన పొలంలో నాటిన జగనన్న భూసర్వే రాయిని పెకలించడం చర్చనీయాంశమైంది. కుప్పం నియోజకవర్గంలో రెండు విడతలుగా 70 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం గుడుపల్లె మండలంలో 12 గ్రామాలు, రామకుప్పంలో ఆరు, కుప్పంలో మూడు గ్రామాల్లో పూర్తిస్థాయిలో రీసర్వే రాళ్లను నాటగా.. శాంతిపురం మండలంలో ఈ మధ్యే సర్వేరాళ్లను నాటే పనులు చేపట్టారు.


మళ్లీ గొడవలు వస్తాయని

మా పక్క పొలం రైతులతో గొడవలు పడుతూ ఉండేవాళ్లం. అందుకే డబ్బులు కట్టి నాలుగు సార్లు సర్వే చేయించాం. మాకు గొడవలు లేకుండా రాళ్లు నాటుకున్నాం. ఇప్పుడేమో రీసర్వే పేరుతో వచ్చి పాత సర్వే రాళ్లను పట్టించుకోకుండా మా పొలం వైపు నాటారు. అందుకే మా ఇరుకుటుంబాల మధ్య మళ్లీ గొడవలు వస్తాయని రీ సర్వే రాయిని పగులగొట్టేశాం.

సాలమ్మ, మహిళా రైతు, ములకలపల్లి


పాతరాయి ఉన్నచోట నాటమంటే..

మా ఇంటి వద్ద ఉన్న పాత సర్వే రాయికి లోపు మేము ఇల్లు నిర్మించుకొన్నాం. ఇంటి పరిసరాల్లో కొబ్బరిచెట్లు కూడా పెంచుకున్నాం. ఇప్పుడేమో రీసర్వేకు వచ్చిన అధికారులు మా ఇంటివైపు సర్వేరాయి నాటేందుకు వచ్చారు. పాతరాయి ఉన్న స్థలాన్ని చూపించి పాతరాయి వద్దే నాటాలని వేడుకొన్నా పట్టించుకోలేదు. అందుకే నా ఇంటి వద్ద సర్వేరాయి నాటొద్దని అడ్డుకున్నా.

తిరుపతి, ములకలపల్లి


సర్వే చేయకుండా రాళ్లెందుకు?

మా ఊరికి సర్వే పేరుతో వచ్చారు. ఒకచోట కూర్చొని పాసుబుక్కులు తెమ్మని రాసుకొని వెళ్లారు. ఇప్పుడు మళ్లీ వచ్చి పొలానికి.. దోవకు ఐదారడుగులు లోపలికి రాళ్లు నాటారు. ఈ రాళ్ల వల్ల అన్నదమ్ములైన మాకు గొడవలు పెట్టారు. అందుకే మూడు సర్వే రాళ్లను పీకేశా. మా రికార్డుల ప్రకారం సర్వే చేస్తేనే రాళ్లు నాటేందుకు ఒప్పుకొంటాం. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ నాటించబోం.

అమాసి, రైతు, ములకలపల్లి


సజావుగా పనులు

కుప్పం రెవెన్యూ డివిజన్‌ పరిధి 70 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశాం. అన్నిచోట్లా రీసర్వే పనులు సజావుగా జరుగుతున్నాయి. ములకలపల్లెలో రాళ్ల తొలగింపు విషయం నా దృష్టికి రాలేదు.

శివయ్య, ఆర్డీవో, కుప్పం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని