logo

ఇవీ మాస్టర్‌ప్లాన్‌ రోడ్లే

తిరుపతికి తూర్పు ప్రాంతంలో నిర్మించిన మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై ఇన్నాళ్లు కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రయాణించేవి.

Updated : 30 May 2023 05:55 IST

ప్రారంభించిన కొద్ది రోజులకే గుంతలు

వైఎస్సార్‌, అన్నమయ్య మార్గాల కూడలిలో చెరువును తలపిస్తున్న రహదారి

న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక) : తిరుపతికి తూర్పు ప్రాంతంలో నిర్మించిన మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై ఇన్నాళ్లు కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రయాణించేవి. శ్రీనివాససేతు నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్‌ మళ్లింపుతో అన్నమయ్య మార్గంపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి రాకపోకలతో రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయటపడింది. పలు ప్రాంతాల్లో తారు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలే మరమ్మతు పనులు చేసిన ప్రాంతంలో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.

పనులు పూర్తైన నెలల వ్యవధిలోనే..

2020 అక్టోబర్‌ 8న కరకంబాడీ రోడ్డు నుంచి కొత్తపల్లె మీదుగా 60 అడుగుల వెడల్పుతో మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు పనులు ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పూర్తిచేసి ప్రారంభించారు. ఇప్పటికీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అన్నమయ్య మార్గం నిర్మాణం కోసం రూ.7.25 కోట్లు ఇప్పటికే వెచ్చించినట్లు నగరపాలిక అధికారులు ప్రకటించారు. ఈ రోడ్డులో నాణ్యత లేని పనుల కారణంగా పలుచోట్ల గుంతలు ఏర్పడడం అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ మార్గం కలిసే ప్రాంతంలో నిర్మించిన కూడలి పరిసరాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించిన రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన కాలువలు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ కూడలి చెరువును తలపించింది. కాలువల్లో ఎక్కడి వర్షపు నీరు అక్కడే స్తంభించి రోడ్డంతా నీటితో నిండి ఉంటోంది.

నాణ్యతపై అనుమానాలు

మూడేళ్ల పాటు నిర్మించిన అన్నమయ్య మార్గంలో నాణ్యతకు తిలోదకాలిచ్చి పనులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నగరంలోని పలు మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నగరవ్యాప్తంగా రూ.40 కోట్ల వెచ్చించి నిర్మిస్తున్న మాస్టర్‌ప్లాన్‌ రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. నగరపాలిక కౌన్సిల్‌లో ప్రకటించిన గడువు లోపు పనులు పూర్తి చేయాలన్న ఆలోచన తప్ప.. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్‌ ప్రకటించిన గడువు ముగిసి రెండు నెలలు పూర్తైనా.. ఇంకా 60 శాతం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వీటిల్లోనైనా నాణ్యత కనిపిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వినాయకసాగర్‌ కింది భాగంలో గుంతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని