logo

సాంకేతిక సమస్యతో నిలిచిన రిజిస్ట్రేషన్లు..!

భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతన్న తరుణంలో ముందుగానే క్రయవిక్రయాలు చేసుకునేందుకు సిద్ధమైన ప్రజలకు సోమవారం షాక్‌ తగిలింది.

Published : 30 May 2023 02:30 IST

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ప్రజల పడిగాపులు

రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వెనుదిరుగుతున్న ప్రజలు

ఈనాడు-తిరుపతి: భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతన్న తరుణంలో ముందుగానే క్రయవిక్రయాలు చేసుకునేందుకు సిద్ధమైన ప్రజలకు సోమవారం షాక్‌ తగిలింది. సాంకేతిక సమస్యతో ఉదయం నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజలు వేచి చూసినా ఒక్క రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు త్వరలో పెరుగుతాయని ప్రచారం నేపథ్యంలో సోమవారం దశమి మంచి రోజు కావడంతో భూములు, స్థలాలు, ఇళ్ల క్రయవిక్రయాలకు ప్రజలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా ముందుగానే చలానాలు తీసుకున్నారు.. ఆ తర్వాత కార్యాలయంలో క్రయవిక్రయదారులతోపాటు సాక్షి సంతకాలతోపాటు ఫొటోలు తీసుకునేందుకు సిద్ధపడుతుండగా సాంకేతిక సమస్య తలెత్తిందంటూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్లు రాలేదు. మరికొన్ని చోట్ల ఫొటోలు తీసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.                     దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్దనే పడిగాపులు కాచారు. రాత్రి ఏడు గంటల వరకు సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో వెనుదిగిరి వెళ్లిపోయారు.

* కిం కర్తవ్యం..: మంగళ, బుధవారాల్లో సాంకేతిక సమస్య తలెత్తకుంటే తమ పరిస్థితి ఏమిటా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జూన్‌ 1వ తేదీ నుంచే భూముల విలువలు పెంచేందుకే ప్రభుత్వం నిర్ణయిస్తే మళ్లీ అదనంగా రిజిస్ట్రేషన్‌ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని