logo

వారు ఇచ్చిందే మద్దతు ధర?

‘మామిడి రైతులకు కిలోకు రూ.19గా మద్దతు ధర నిర్ణయించాం. రైతులు, కొనుగోలుదారుల సమక్షంలో దీన్ని ఖరారు చేశాం.

Updated : 30 May 2023 05:59 IST

కిలోకు రూ.19 నిర్ణయించినా తగ్గిస్తున్న వైనం
గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల తీరుతో రైతులకు తీవ్ర నష్టం

గుడిపాల మండలంలో నిలిపిన మామిడి కాయల లారీలు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు: ‘మామిడి రైతులకు కిలోకు రూ.19గా మద్దతు ధర నిర్ణయించాం. రైతులు, కొనుగోలుదారుల సమక్షంలో దీన్ని ఖరారు చేశాం. అన్ని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, అన్నదాతలు ఒకే మాటపై నిలబడాలి. ప్రకటించిన ధరలు మే 10 నుంచి మే 20 వరకు అమలులో ఉంటాయి. అనంతరం మరోసారి సమావేశమై మద్దతు ధర నిర్ణయిద్దాం’

ఇదీ ఈ నెల 10న కలెక్టర్‌ షన్మోహన్‌ సమక్షంలో మామిడి రైతులు, యాజమాన్యాల మధ్య జరిగిన చర్చల తుది సారాంశం.

 మూడు రోజులపాటు మాటపై నిలబడ్డ పరిశ్రమల నిర్వాహకులు ఆ తర్వాత తిరిగి తమ పంథానే అనుసరిస్తున్నారు. ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రస్తుతం కిలోకు రూ.12- 15 మాత్రమే ఇస్తుండటంతో ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. దాదాపు అన్ని యాజమాన్యాలు ఒకేతాటిపై ఉండటంతో ఎక్కడకు వెళ్లినా అన్నదాతలకు ఇదే ధర వస్తోంది. గట్టిగా మాట్లాడితే కాయలు పక్వానికి రాలేదని.. అందుకే ధర తక్కువగా ఉందని సమాధానమిస్తున్నారు. మరోసారైనా సమావేశం నిర్వహించి తమను ఒడ్డున పడేయాలని రైతులు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో తోతాపురి రకం మామిడి సాగవుతోంది. అత్యధికంగా స్థానికంగా ఉన్న గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలే వీటిని కొనుగోలు చేస్తాయి. పరిశ్రమలు దూరంగా ఉన్నచోట మాత్రం మండీల యజమానులు, ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తుంటారు. వారు తమిళనాడుతోపాటు జిల్లాలో ఎక్కడ ఎక్కువ దూరం ఉంటే అక్కడ అమ్ముకుని లాభపడతారు. ఈ ఏడాది దిగుబడులు నామమాత్రంగా ఉండటంతో మంచి ధర వస్తుందని అన్నదాతలు భావించారు. రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ సైతం సీజన్‌కు ముందే జిల్లాకు వచ్చి యాజమాన్యాలు, రైతులతో సమావేశం నిర్వహించారు. దీంతో మంచి రేట్లు వస్తాయని అన్నదాతలు ఆశించారు. కలెక్టర్‌ కూడా ఇరువర్గాలతో చర్చించి కిలో రూ.19కు తోతాపురి కొనాలని ఆదేశించడంతో ఎంతోకొంత గిట్టుబాటవుతుందని రైతాంగం భావించింది.

కుదరని పొంతన: ప్రస్తుతం గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు కిలోకు రూ.12- 15 మాత్రమే ఇస్తున్నాయి. మండీల యజమానులు, ప్రైవేటు వ్యక్తులు రూ.10-14కు కొనుగోలు చేస్తున్నారు. వారు వెంటనే డబ్బులు ఇస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు అమ్ముకుంటున్నారు. జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరకు.. పరిశ్రమల నిర్వాహకులు కొంటున్న ధరకు  పొంతన కుదరడం లేదు. కిలోపై రూ.4-  7 వరకు నష్టపోతున్నామని.. ఈ లెక్కన టన్నుకు రూ.4 - 7వేలు కోల్పోతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం రంగంలోకి దిగితేనే: అన్నదాతలకు న్యాయం జరగాలంటే జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరకే గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలి. ఒకవేళ వాళ్లు గిట్టుబాటు కావడం లేదని చెబితే ప్రభుత్వమే స్పందించి టన్నుకు రూ.3వేలు- రూ.5వేలు అదనంగా రైతులకు ఇవ్వాలి. అప్పుడే అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన కర్షకులకు ఎంతోకొంత ఉపశమనం లభిస్తుంది.

గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరుకు చెందిన రైతు సోమశేఖర్‌రెడ్డికి తొమ్మిది ఎకరాల మామిడి తోట ఉంది. దుక్కి, ఎరువులు, పురుగు మందుల పిచికారీకి కలిపి ఎకరాకు రూ.30వేలు ఖర్చు చేశారు. ఈ ఏడాది 25 శాతం దిగుబడులు మాత్రమే వచ్చాయి. టన్ను రూ.30వేలు వస్తుందని ఆశించగా.. సగం ధర కూడా రాకపోవడంతో నష్టపోవాల్సిందేనని మదనపడుతున్నారు. జిల్లా యంత్రాంగం టన్ను రూ.19వేలుగా నిర్ణయించినప్పటికీ పరిశ్రమల యజమానులు ఆ ధర ఇవ్వడంలేదు. టన్ను రూ.14వేలు చెప్పడంతో ఆ ధరకే విక్రయించానని రైతు చెబుతున్నారు.

సోమల మండలం మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన శివకుమార్‌ అనే రైతు సోమవారం మండల కేంద్రంలోని మండీలో టన్ను రూ.13 వేలకు కాయలు అమ్మారు.

ఇలాగైతే సాగు చేయలేం..

నేను 25 ఎకరాల్లో మామిడి సాగు చేశా. అధికారుల సమక్షంలో టన్ను రూ.19 వేలకు కొంటామని యాజమాన్యాలు చెప్పాయి. ప్రస్తుతం రూ.12 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని పరిశ్రమలైతే కాయలు తీసుకురావద్దంటున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యవసాయం చేయడం కష్టం. ఇటీవల అకాల వర్షాలు పడటంతో కాయలకు మచ్చలు పడ్డాయి. అధికారులు స్పందించి అన్నదాతలకు న్యాయం చేయాలి.

ఉమాచంద్రన్‌, బొమ్మాయిపల్లె రైతు, వెదురుకుప్పం మండలం

మరో దఫా సమీక్షిస్తాం

మామిడి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల సమక్షంలో మరో దఫా అన్నదాతలు, పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి గిట్టుబాటు ధరలు వచ్చేలా చూస్తాం.

మధుసూదన్‌రెడ్డి, డీడీ, ఉద్యాన శాఖ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు