logo

నెలలు గడుస్తున్నా.. పరిష్కారం దొరకలే

చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు.. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఆలకించే నాథుడే కరవయ్యాడు..

Published : 30 May 2023 02:30 IST

తిరిగితిరిగి విసుగొస్తోంది
బాధితుల కన్నీటి వేదన

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌ : చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు.. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఆలకించే నాథుడే కరవయ్యాడు.. చేసేదిలేక వ్యయప్రయాసల కోర్చి చిత్తూరు కలెక్టరేట్‌కు వస్తున్నామని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు. క్షేత్రస్థాయిలో తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపో యారు.. ఇలా ఇంకెన్నాళ్లు తిరగాలో అర్థం కావడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.


భూ సమస్య పరిష్కరించాలి..

తన భూ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు విజయపురం మండలం ఎం.అగరం ఎస్సీ కాలనీకి చెందిన మునిరత్నం. తన అనుభవంలో ఉన్న 17 సెంట్ల భూమి 22(ఏ) ఖాతాలో చేరి పోయింది. దీంతో ఆ భూమిపై ఎలాంటి హక్కు లేకుండా పోయింది. నా అనుభవంలో మరొక సర్వే నంబర్‌లో ఉన్న 68 సెంట్ల భూమికి డీకేటీ పట్టా మంజూరు చేయాలని పలుమార్లు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకున్నా. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. క్షేత్రస్థాయిలో అధికారులు విచారించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. అసలు తమ సమస్య ఎప్పటికి పరిష్కరిస్తారో తెలియడం లేదు. అందుకే ఇక్కడకు వచ్చి ఉన్నతాధికారులకు విన్నవించా. వారు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నా.


భూమి ఆక్రమించారు..

తనకున్న రెండు సెంట్ల భూమిని కొందరు ఆక్రమించారని వాపోయారు గంగవరం మండలం గొర్రెలదొడ్డి గ్రామానికి చెందిన రమాదేవి. జీవనోపాధి కోసం చిల్లర దుకాణం నిర్వహించుకుంటున్నా. ఉన్న రెండు సెంట్ల స్థలం ఆక్రమణకు గురికావడంతో ఇబ్బంది పడుతున్నా. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. కనీసం నా మొర ఆలకించలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చింది. అందుకే ఇక్కడకొచ్చా. ఉన్నతాధికారులు స్పందించి తన భూమి సర్వే చేయించి న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని