logo

ఉమ్మడి జిల్లాలో సమర్థంగా గృహ నిర్మాణ పథకం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి నాలుగేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

Published : 31 May 2023 03:57 IST

కేకు కోస్తున్న మంత్రి జోగి రమేష్‌, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి నాలుగేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. మంగళవారం శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో గృహ నిర్మాణ ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జగనన్న కాలనీలు ఊర్ల తరహాల్లో తయారయ్యాయన్నారు. ఉమ్మడి జిల్లాలో గృహ నిర్మాణ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారని కలెక్టర్లను అభినందించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ జగనన్న కాలనీలు రానున్న రోజుల్లో పంచాయతీ, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలుగా మారడం ఖాయమన్నారు.  సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఆ శాఖ ఎండీ లక్ష్మీషా, తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు వెంకటరమణారెడ్డి, షన్మోహన్‌, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, సంజీవయ్య, మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, ఎమ్మెల్సీ భరత్‌, వైకాపా వెంకటగిరి ఇన్‌ఛార్జి రాంకుమార్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, తిరుపతి, చిత్తూరు మేయర్లు శిరీష, అముద, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత, చిత్తూరు జేసీ శ్రీనివాసులు, డీఆర్వో శ్రీనివాసులు పాల్గొన్నారు.

* ఎమ్మెల్యేల గైర్హాజరు.. సమీక్షకు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజాతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీనిపై ఉప ముఖ్యమంత్రి సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం.

* మహిళా వర్సిటీలో పేరుకు సమీక్ష సమావేశం అయినా.. వైకాపా నాలుగేళ్ల పాలనపై సంబరాలు చేసుకున్నారు. వేదికపై భారీ కేకును కోసిన నాయకులు జై జగన్‌ అంటూ నినాదాలు చేయడంతో ఆడిటోరియం మారుమోగింది. విద్యాలయం ఆవరణలో అధికార పార్టీ రాజకీయ నినాదాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని