logo

సెలవులు.. సేవలు

ఏడాదంతా తరగతులు.. పరీక్షలతో తీరిక లేకుండా ఉన్నారు. పరీక్షలు పూర్తవగానే వేసవి సెలవులు వచ్చాయి. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సొంతూళ్లకు వెళ్లాక ఖాళీ సమయంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలనుకున్నారు.

Published : 31 May 2023 04:07 IST

ఆదర్శం.. మహిళా వర్సిటీ విద్యార్థినులు
న్యూస్‌టుడే, తిరుపతి(మహిళా వర్సిటీ), చంద్రగిరి

ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్న విద్యార్థిని తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందజేస్తున్న వర్సిటీ విద్యార్థినులు

డాదంతా తరగతులు.. పరీక్షలతో తీరిక లేకుండా ఉన్నారు. పరీక్షలు పూర్తవగానే వేసవి సెలవులు వచ్చాయి. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సొంతూళ్లకు వెళ్లాక ఖాళీ సమయంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలనుకున్నారు. చరవాణి ద్వారా మాట్లాడుకొని తమ తమ ఊళ్లలో అక్కడి స్నేహితులతో కలిసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు.


పిల్లలకు పాఠాలు
- బి.శివలక్ష్మి, ఫుడ్‌ టెక్నాలజీ

మాది మదనపల్లె. సెలవులకు ఇంటికి వచ్చాక ఖాళీగా ఉండకుండా ట్యూషన్‌ చెప్పాలనే ఆలోచన వచ్చింది. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలను చేరదీసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంట సమయం ఉచితంగా ట్యూషన్‌ చెబుతున్నా. కొందరు పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. సరైన దుస్తులు కూడా లేని పరిస్థితిలో ఇంకొందరు ఉన్నారు. అలాంటి వారికి దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశాం.


పుస్తకాల పంపిణీ
- సి.శిరీష, ఫుడ్‌ టెక్నాలజీ

మాది కర్నూలు. మహిళా వర్సిటీలో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి వివేకానంద ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం, ఆహార ప్యాకెట్లు పంచడం, దుప్పట్లు, పిల్లలకు స్టడీ మెటీరియల్‌ అందజేసేదాన్ని. సెలవులకు ఇంటికి వచ్చాక ఇక్కడి స్నేహితులతో కలిసి కొంత నగదు సేకరించా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మా ఊరిలో, పక్కఊరిలోని పేద కుటుంబాలకు చెందిన చిన్నపిల్లలకు కథల, నోట్‌ పుస్తకాలు పంచిపెట్టా. ముసలివాళ్లకు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఎండు పండ్లు ఇచ్చాం.


మొక్కలు నాటాం
- వై.తేజశ్విని, ఐఎఫీటీ

మాది హైదరాబాదు. ఇక్కడ పెద్దపెద్ద భవనాలే ఎక్కువ. మా స్నేహితులతో కలిసి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి వంద మొక్కలు నాటాలనుకుని తలచి పదిరోజుల్లో నాటి సంరక్షణ చూస్తున్నాం. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేశాం.


సేవ చేయడం ఆనందం
- బి.హరిత, ఐఎఫ్‌టీ

మాది కడప. మహిళా వర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు చదువుతున్నా. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. ఇంటికి వచ్చేశాం. కళాశాలలో ఉన్నప్పుడు వివేకానంద ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు భానుప్రకాష్‌తో కలిసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పటి వరకు 500కు పైగా కార్యక్రమాలు చేశాం. వర్సిటీలో సంగీత విభాగం విద్యార్థినికి రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.16వేలు సహాయం చేశాం. సెలవులకు ఇంటికి వచ్చాక స్నేహితులతో కలిసి ఇక్కడ ఉన్న వివిధ పాఠశాలలు, చిన్నచిన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటాం. రోడ్డుపక్కన ఉన్న యాచకులు, ముసలివాళ్లకు అన్నం ప్యాకెట్లు అందజేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు