logo

బకాయిలు ఇవ్వరు.. వసతులు కల్పించరు

గ్రంథాలయాల అభివృద్ధికి దన్నుగా నిలవాల్సిన స్థానిక సంస్థలు చెతులేత్తెస్తున్నాయి. ప్రజల నుంచి పన్నుల్లో వసూలు చేసే 8 శాతం సెస్సు నిధులను సొంతానికి వాడుకుంటున్నాయి.

Published : 31 May 2023 04:13 IST

గ్రంథాలయాలకు సెస్సులివ్వని స్థానిక సంస్థలు
ఐదేళ్లలో రూ.20 కోట్లు పెండింగ్‌

పుంగనూరులో ఒకే భవనంలో నడుస్తున్న తెలుగు శాఖాగ్రంథాలయం, ఉర్దూ గ్రంథాలయం

పుంగనూరు, న్యూస్‌టుడే: గ్రంథాలయాల అభివృద్ధికి దన్నుగా నిలవాల్సిన స్థానిక సంస్థలు చెతులేత్తెస్తున్నాయి. ప్రజల నుంచి పన్నుల్లో వసూలు చేసే 8 శాతం సెస్సు నిధులను సొంతానికి వాడుకుంటున్నాయి. దీంతో యువతకు ఉపయోగపడాల్సిన గ్రంథాయాలు వసతులు లేక కునారిల్లుతున్నాయి. గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలను విస్మరించాయి. ఫలితంగా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ నిధులు లేక అవస్థలు పెరిగినట్లు ఆశాఖ ఉద్యోగులు వాపోతున్నారు.

జిల్లాలో గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 71 గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. వాటిలో సుమారు 6 లక్షల పుస్తకాలు ఉన్నాయి. 43 వేల మంది సభ్యులున్నారు. రోజూ దాదాపు 5 వేల మంది పాఠకులు వస్తుంటారు. ఐతే 49 కేంద్రాలకు సొంత భవనాలు, 18 ఇతర ప్రభుత్వ భవనాలు, 4 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. సొంత భవనాల్లో 50 శాతానికిపైగా శిథిలావస్థకు చేరాయి. మిగిలిన వాటికి సొంత భవనాల నిర్మాణం ఊసే లేదు. ఇతర ప్రభుత్వ భవనాల నిర్వహణ లేకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణకు అనువుగా లేవు.
కొత్త పుస్తకాల కొనుగోలుకు ఇబ్బందులు: పంచాయతీలు, మేజర్‌ పంచాయతీలు, పురపాలికలు, కార్పోరేషన్లలోని ఇంటి యజమానుల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. ఐతే పుస్తక నిధికి జమచేయాల్సిన 8 శాతం సెస్సును చెల్లించాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఏటా ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలకు ఏటా రూ.5 కోట్లు రావాలి. అయితే గత సంవత్సరం రూ.3 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఇలా ప్రతి ఏటా రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నట్లు ఆ సంస్థ అధికారులు వాపోతున్నారు. ఇలా 5 ఏళ్లుగా రూ. 20 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్థాయిలో నిధులు రాకపోవడంతో యువతకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుకు ఇబ్బందిగా మారింది. చాలా చోట్ల అవి అందుబాటులో లేవు. మరోవైపు పాఠకులు అడిగే పుస్తకాలు తెప్పించలేకపోతున్నారు.   దిన, పక్ష, మాస పత్రికలు, పాత పుస్తకాలతో నడిపిస్తున్నారు. కొన్ని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది.


బకాయిలు రాబడతాం..  
- లావణ్య, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, చిత్తూరు

జిల్లాలో గ్రంథాలయాలకు రావాల్సిన సెస్సు వసూలుకు కృషి చేస్తున్నాం. భారీగా బకాయిలున్న సంస్థలకు నోటీసులు ఇచ్చాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు