logo

అద్దె వాహనాలతో అధికారుల కక్కుర్తి

తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ ఇంజినీర్‌ అద్దె వాహనం వెసులుబాటు కలిగి ఉన్నారు. సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపిస్తూ నగరపాలిక కార్యాలయం నుంచి నెలసరి అద్దె పొందుతున్నారు.

Published : 31 May 2023 04:23 IST

అంతా నగరపాలిక ఖర్చే
న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక)

* తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ ఇంజినీర్‌ అద్దె వాహనం వెసులుబాటు కలిగి ఉన్నారు. సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపిస్తూ నగరపాలిక కార్యాలయం నుంచి నెలసరి అద్దె పొందుతున్నారు. అద్దె ఒప్పందం ప్రకారం డ్రైవర్‌ను దాని యజమానే సమకూర్చాలి. కానీ ఇంజినీర్‌ నగరపాలిక నుంచి జీతం తీసుకుంటున్న డ్రైవర్‌ను తన వాహనానికి డ్రైవర్‌గా నియమించుకున్నారు. ఇంతటితో ఆగకుండా నగరపాలిక వాహనాలకు నిత్యం డీజిల్‌ నింపే చోటే ఆయన వాహనానికి నింపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంత వాహనం, నగరపాలిక డ్రైవర్‌, నగరపాలిక చెల్లించే బిల్లుల నుంచి డీజిల్‌ పొందుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వైనం అక్కడి కార్యాలయంలో పనిచేసే చాలా మందికి తెలుసు.

* ఇది కేవలం ఇంజినీర్‌కు మాత్రమే పరిమితం కాలేదు. నగరపాలిక అద్దె వాహనాల వ్యవహారంలో అనేక మంది అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే వ్యవహారంపై ప్రైవేటు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి వివరాలు, వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్న అధికారుల సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.


గరపాలక సంస్థ పరిధిలో కమిషనర్‌, అదనపు కమిషనర్‌ మినహా అధికారులందరికీ అద్దె వాహనాలు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నగరపాలిక పరిధిలో నెలకు రూ.35 వేల అద్దె ప్రాతిపదికన 18, నెలకు రూ.45 వేల అద్దె ప్రాతిపదికన ఒక వాహనాన్ని సమకూర్చారు. అధిక రీడింగ్‌ తిరిగే వాహనాలతో కలిపి ఏటా రూ.86 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. గతేడాది అద్దె వాహనాల వ్యవహారంలో అనుమానాలు వ్యక్తం కావడంతో అప్పటి కమిషనర్‌ అనుపమ అంజలి 10 నెలల బిల్లుల్ని చెల్లించేందుకు నిరాకరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20 అద్దె వాహనాల కోసం రూ.90 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పాత బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడానికి కారణం అద్దె వాహనాల్లో గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతోనేనని తెలిసింది.

రిజిస్ట్రేషన్‌ నంబరు ఒకటి.. తిరిగేది మరొకటి

నగరపాలక సంస్థకు సమర్పించే బిల్లుల్లో ఎవరో ప్రైవేటు వ్యక్తులు, ట్రావెల్స్‌ నుంచి బిల్లులు సమర్పిస్తున్నారు. వాస్తవానికి వారు సమర్పించిన బిల్లులో సూచించిన వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు, సదరు అధికారి వినియోగించే వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్లు వేర్వేరుగా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ ఏడాది నుంచి యాజమానులు, ట్రావెల్స్‌ వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. వాస్తవానికి ఎల్లో బోర్డు వాహనాల బిల్లు సమర్పిస్తున్నా.. అధికారులు ఎక్కువగా వైట్‌ బోర్డు కలిగి ఉన్న వాహనాల్లోనే కనిపిస్తుంటారు.


ఇదీ లెక్క..

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెలకు ఒక్కో వాహనానికి రూ.35 వేలు అద్దె చెల్లించాలి. అద్దె వాహనంతో పాటు డ్రైవర్‌, నెలకు 2500 కి.మీ. వరకు అయ్యే డిజిల్‌ ఖర్చు వాహన అసలు యజమానే భరించాలి. సొంత వాహనం(వైట్‌ బోర్డు) కలిగిన వాహనాన్ని వినియోగించకూడదు. నిర్దేశించిన దూరానికి మించి తిరిగితే కి.మీ.కు రూ.10 చొప్పున చెల్లించాలి. మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులు యజమానే చెల్లించాలి. నిబంధనలు భేఖాతరు చేస్తూ కొందరు అధికారులు నగరపాలిక డ్రైవర్లను, నగరపాలిక డీజిల్‌ను వినియోగిస్తూ వ్యక్తిగత వాహనాలకు పూర్తిస్థాయి అద్దెలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి.


విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
- మోహన్‌, ఎస్‌ఈ, తిరుపతి నగరపాలక సంస్థ

అద్దె వాహనాలకు సంబంధించి గత సంవత్సరం పలువురు యజమానులు ఇంకా బిల్లులు సమర్పించలేదు. సమర్పించిన అనంతరం వాటిలో లోటుపాట్లు గుర్తించి బిల్లులు చెల్లిస్తాం. పలువురు బిల్లులు సమర్పించకపోవడం వల్లే వారికి బిల్లులు ఇవ్వలేదు. నగర పాలక కమిషనర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని