logo

ఆయకట్టు రైతుల నోట్లో మట్టి

జల వనరుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం ద్వారా కొత్త చెరువుల నిర్మాణంతోపాటు ప్రస్తుతమున్న వాటినీ అభివృద్ధి చేస్తోంది.

Updated : 02 Jun 2023 04:04 IST

జాతీయ రహదారుల నిర్మాణం పేరిట చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

బంగారుపాళ్యం మండలం కోనిరెడ్డిచెరువులో   అక్రమంగా మట్టిని తవ్వుతున్న దృశ్యం (పాతచిత్రం)

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, నిండ్ర: జల వనరుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం ద్వారా కొత్త చెరువుల నిర్మాణంతోపాటు ప్రస్తుతమున్న వాటినీ అభివృద్ధి చేస్తోంది. చెరువులపై కేంద్రం ఇంత   శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు జిల్లాలోని జలవనరుల శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి? అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి జాతీయ రహదారుల నిర్మాణాన్ని సాకుగా చూపుతూ పూతలపట్టు, నగరి నియోజకవర్గాల్లో చెరువుల్లో మట్టి తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సదరు గుత్తేదారు సంస్థలు అంతకుమించి అన్నట్టుగా మట్టిని తరలిస్తుండటంపై ఆయకట్టు రైతులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు జిల్లాలో లేకపోవడంతో అన్నదాతలు చెరువులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల కిందట పడిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులకు శాశ్వత మరమ్మతులు చేయని జలవనరుల శాఖ అధికారులు జాతీయ రహదారి నిర్మాణాలకు మట్టి తీసుకునేందుకు ఆగమేఘాలపై అనుమతులు ఇస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం బెంగళూరు- చెన్నై, చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాలకు అవసరమైన మట్టిని ఆయా సంస్థలు అధిక శాతం కొండలు, గుట్టల నుంచి తీసుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తోంది. గుట్టల నుంచి తరలించేందుకు ఎక్కువ వ్యయం అవుతుండటంతో ఇటీవల బంగారుపాళ్యం, నిండ్ర, విజయపురం, నగరి మండలాల్లో చెరువుల నుంచి మట్టిని తవ్వేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకుంటున్నారు.  

నిధులొచ్చిన చెరువులోనూ..

నిండ్ర పెద్ద చెరువు మరమ్మతులకు రెండేళ్ల క్రితం జైకా నిధులు రూ.కోటి రాగా కట్టపై ఉన్న ముళ్ల చెట్లను మాత్రం తొలగించి ఆ తర్వాత పనుల ఊసే మరిచారు. ఇప్పుడు అక్కడ కూడా మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూగర్భ జలాల పరిస్థితేమిటంటూ

మట్టి కోసం చెరువును ఇష్టారాజ్యంగా తవ్వేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని అన్నదాతలు వాపోతున్నారు. గుంతల కారణంగా మనుషులు, మూగజీవాల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అంటున్నారు. స్థానిక రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నేతలనే కార్యాలయాలకు పిలిపించి అనుమతులు ఇచ్చామని చెప్పడం వెనుక ఆంతర్యమేంటని మండిపడుతున్నారు.


కొంతమేర తవ్వుకోవడానికే అనుమతులు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులకు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చాం. అక్కడ కూడా కొంతమేరే తీసుకోవాలని స్పష్టం చేశాం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.

విజయకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ


అండతోనే అడ్డదిడ్డంగా..

సోమేశ్వరం చెరువులో మట్టి తవ్వకాలు చేస్తున్న దృశ్యం

బంగారుపాళ్యం మండలం కొనిరెడ్డిచెరువులో నెల రోజుల కిందట ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలించారు. వారం రోజులపాటు రాత్రింబవళ్లు యంత్రాలతో తవ్వడంతో గ్రామస్థులు ఆందోళన చేసి పనులు నిలిపేశారు. స్థానిక వైకాపా నాయకుల అండతోనే చెరువును ఇలా కొల్లగొట్టారు. చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ వేకు అవసరమైన మట్టి కోసం గత నెలలో నిండ్ర మండలం ఆలపాకం చెరువులోనూ భారీగా తవ్వకాలు చేశారు. ఆయకట్టు రైతులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలపడంతో నిర్మాణ సంస్థ వెనక్కు తగ్గింది.


తూముకు మరమ్మతులు చేయరు కానీ..

నగరి, విజయపురం మండలాల్లోనూ ఇదే విధంగా మట్టిని తరలించారు. తాజాగా మంగళవారం నిండ్ర మండలం సోమేశ్వరం చెరువులోనూ దాదాపు 10 అడుగుల లోతు వరకు తవ్వేశారు. మూడేళ్ల కిందట దెబ్బతిన్న తూముకు మరమ్మతులు చేయించని జలవనరుల శాఖ అధికారులు మట్టి తవ్వకాలకు మాత్రం అనుమతులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ పనులు అడ్డుకున్నారు.


వ్యవసాయానికి కష్టమన్నా వినలేదు

‘బంగారుపాళ్యం మండలం కోనిరెడ్డిచెరువులో ఇటీవల అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయం చేసుకోవడం కష్టంగా మారుతుందని సంబంధిత వ్యక్తులకు చెప్పినా మా మాటను లెక్కచేయలేదు. చివరకు రైతులంతా గట్టిగా ప్రశ్నించడంతో తవ్వకాలు నిలిపేశారు. ఈ విషయంలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు స్పందించి అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలి.’

శాంతమూర్తి, రైతు, బంగారుపాళ్యం మండలం


పది అడుగులకు పైగా తవ్వుతున్నారు

వర్షాలు లేనప్పుడు నిండ్ర మండలం సోమేశ్వరం చెరువులో పశువులు మేపుతున్నాం. మేతకు ఎటువంటి ఇబ్బంది లేదు. మట్టి కోసం 10 అడుగులకుపైగా తవ్వుతుండటంతో మూగజీవాలు అందులో పడే ప్రమాదం పొంచి ఉంది. అవి మరణిస్తే మా బతుకుదెరువు ఏం కావాలి?

ఏలుమలైరెడ్డి, రైతు, నిండ్ర మండలం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని