logo

బదిలీలు ఆరంభం

జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ మొదలైంది.. ముఖ్యమైన శాఖల జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇస్తున్నారు..

Published : 02 Jun 2023 02:19 IST

శాఖల వారీగా మార్పులు
వేగిరమైన దస్త్రాలు

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ మొదలైంది.. ముఖ్యమైన శాఖల జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇస్తున్నారు.. ఇప్పటికే విద్యుత్తు, వ్యవసాయ, దాని అనుబంధ శాఖలు సహా ఆర్‌అండ్‌బీ ఇలా పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ ఊపందుకుంది.. రెండుమూడ్రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనుంది.

విద్యుత్తు శాఖలో..  విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ పరిధిలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. తిరుపతి ఎస్‌పీఎం డీఈఈగా పనిచేస్తున్న విజయభాస్కర్‌ నియంత్రికల విభాగానికి బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న ప్రభాకర్‌ ఎస్‌పీఎంకు బదిలీ అయ్యారు. సర్కిల్‌ పరిధిలో ఇద్దరు ఏఈలు, ఐదుగురు జేఈఈలు, 13 మంది సీనియర్‌ సహాయకులు, నలుగురు జూనియర్‌ సహాయకులు, ఎనిమిది మంది కార్యాలయ సబార్డినేట్లను బదిలీ చేస్తూ ఎస్‌ఈ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

వ్యవసాయశాఖలో..  జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలోని జిల్లా వనరుల కేంద్రం ఏడీ గోపాల్‌ను గుంటూరులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. వ్యవసాయ శాఖ పలమనేరు డివిజన్‌ కార్యాలయ సాంకేతిక అధికారి గీతాకుమారిని బైరెడ్డిపల్లె మండల ఏవోగా బదిలీ చేశారు. బైరెడ్డిపల్లె మండల ఏవో మునికృష్ణను గోరంట్లకు, నిండ్ర మండల ఏవో మురళీకృష్ణను తిరుపతి జిల్లా కేవీబీపురం మండలానికి, తొండూరు ఏవో తులసీరామ్‌ను నిండ్రకు బదిలీ చేస్తూ కమిషనర్‌ హరికిరణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈగా ఉమామహేశ్వరరెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రహదారులు-భవనముల శాఖలో బదిలీలు జరిగాయి. జిల్లా పర్యవేక్షక ఇంజినీరు (ఎస్‌ఈ) దేవానందం ప్రకాశం జిల్లా ఎస్‌ఈగా బదిలీ అయ్యారు. నూతన ఎస్‌ఈగా రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ ఇంజినీరుగా విధులు నిర్వర్తిస్తున్న ఉమామహేశ్వరరెడ్డిని నియమించారు. చిత్తూరు డీఈఈగా విధులు నిర్వహిస్తున్న దస్తగిరిని కడప జిల్లాకు బదిలీ చేశారు. చిత్తూరు డీఈఈగా ఇంకా ఎవరినీ నియమించలేదు.


ఎస్జీటీలకు ఉద్యోగోన్నతి

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఏడీ

చిత్తూరు విద్య: ఉమ్మడి జిల్లాలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్లలో సీనియర్లకు విద్యాశాఖ ఉద్యోగోన్నతి కల్పించింది. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఏడీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పాఠశాల సహాయకుల కేడర్‌లో సబ్జెక్టుల వారీగా ఆంగ్లంలో 17, గణితం ఒక పోస్టులు ఉద్యోగోన్నతి ద్వారా భర్తీ చేశారు.  


నే ఇక్కడే ఉంటా..!

చిత్తూరు విద్య: సమగ్ర శిక్ష ఏపీసీగానే తనను కొనసాగించాలని వెంకటరమణారెడ్డి.. రాష్ట్ర ఉన్నతాధికారులకు అభ్యర్థన పత్రాన్ని అందజేశారు. ఆయన మాతృశాఖ నుంచి డిప్యూటేషన్‌పై సమగ్ర శిక్షకు వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. జగనన్న విద్యాకానుకను ఈ నెల 12న పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయాల్సి ఉండటంతో ఆయన్ను కొద్దికాలం ఇక్కడే కొనసాగించాలని.. జిల్లా ఉన్నతాధికారి ద్వారా గతంలో సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులకు లిఖిత పూర్వకంగా అభ్యర్థన పంపారు. అక్కడ పరిశీలనలో ఉండగానే మరోసారి ఆయన రాష్ట్ర ఉన్నతాధికారులను సంప్రదించారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని