logo

బలి తీసుకున్న నిద్రమత్తు

వాహన చోదకుడి నిద్రమత్తు అదే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ఇద్దరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జేసింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా ఢీకొంది.

Published : 02 Jun 2023 02:19 IST

బస్సును ఢీకొట్టిన కారు
ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు

ప్రమాదంలో నుజ్జయిన కారు

వెంకటమ్మ, అశోక్‌, శాన్వితాక్షరి, దినేష్‌ (పాత చిత్రాలు)

ఏర్పేడు, న్యూస్‌టుడే: వాహన చోదకుడి నిద్రమత్తు అదే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ఇద్దరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జేసింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదం శ్రీకాళహస్తి- రేణిగుంట ప్రధాన రహదారిపై ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీహరి కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లెకు చెందిన వెంకటమ్మ(65) ఆమె కుమారులు దినేష్‌ అలియాస్‌ వెంకన్న(40), రాంబాబు(38), అశోక్‌(35)తో పాటు మనువరాళ్లు (దినేష్‌ కుమార్తెలు) భాన్వితాక్షరి(10), శాన్వితాక్షరి(6)లు అందరూ కలిసి కారులో బయలుదేరి తిరుమల చేరుకున్నారు. వెంకటమ్మ కూతురు రేణుక కుమారుడి పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి గురువారం శ్రీకాళహస్తి బయలుదేరారు. ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చొన్న అశోక్‌, శాన్వితాక్షరి, వెనుక సీటులో కూర్చొన్న వెంకటమ్మ, అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న రాంబాబు, దినేష్‌, పెద్ద కుమార్తె భాన్వితాక్షరిలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో దినేష్‌ అలియాస్‌ వెంకన్న వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో రాంబాబు, దినేష్‌లు ప్రభుత్వ ఉపాధ్యాయులు. అశోక్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. కారు నడుపుతున్న రాంబాబు నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు శ్రీకాళహస్తి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు.


కట్టలు తెగిన కన్నీళ్లు

క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తున్న సీఐ శ్రీహరి

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మృతులు.. క్షతగాత్రులై ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ల పరిస్థితి తెలుసుకుని కట్టలు తెగిన కన్నీళ్లతో కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులు, మనువరాలు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

తల్లితోనే.. తనయులు..: వెంకటమ్మతో పాటు ఆమె కుమారులు ఇద్దరు అశోక్‌, దినేష్‌ అలియాస్‌ వెంకన్న అనంత లోకాలకు చేరారు. ప్రమాదంలో కారు నడుపుతూ క్షతగాత్రుడైన పెద్ద కుమారుడు రాంబాబు, దినేష్‌ పెద్దకుమార్తె శాన్వితాక్షరి ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. వారి మృతదేహాలను చూసి కుటుంబీకులు తీవ్ర వేదనకు గురయ్యారు.

చెల్లికి ఏమైంది..: ఈ ప్రమాదంలో అప్పటి వరకు పక్కపక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న అక్కాచెల్లెళ్లు భాన్వితాక్షరి, శాన్వితాక్షరిల్లో చెల్లెలు శాన్వితాక్షరి బాబాయి వద్ద ఒడిలో కూర్చొనేందుకు వెళ్లింది. ప్రమాదంలో బాబాయ్‌తో పాటు ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అయితే రోడ్డుపక్కన ముఖంపై గుడ్డకప్పి ఉండటంతో గాయాలకు గురైన భాన్వితాక్షరి చెల్లికి ఏమైందంటూ అడగడంతో అక్కడే ఉన్న కళ్లు సైతం చెమ్మగిల్లాయి.

ఆఖరు నిమిషంలో మార్పులు..: ఆడబిడ్డ ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు వెంకటమ్మ కుమారులు, కోడళ్లు, మనువళ్లు, మనవరాళ్లు అందరూ కలసి బయలుదేరాలని భావించినా ఆఖరు నిమిషంలో మార్పులతో వెంకటమ్మ, ఆమె ముగ్గురు కుమారులు, ఇద్దరు మనుమరాళ్లు మాత్రమే వచ్చారు. రాంబాబు సతీమణి సంధ్య గర్భిణి. నాలుగో నెల కావడంతో కుమార్తె హనీతో కలిసి పుట్టింటికి వెళ్లింది. దినేష్‌ భార్య జ్యోతి. ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నారు. కుమారుడితో జ్యోతి ఇంటి వద్దనే ఉంది. ప్రమాదం విషయం తెలిసి ఆయా కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరయ్యారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని