logo

కువ్వాకుళ్లిలో ఆరని మంటలు

టపాసుల గిడ్డంగి, తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కనీసం కడసారి చూపు సైతం దక్కలేదంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు చూపరులను కలిచివేసింది.

Published : 02 Jun 2023 02:19 IST

కలెక్టర్‌, ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు
బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం

కలెక్టరు, ఎమ్మెల్యే వాహనాలకు అడ్డుపడుతున్న గ్రామస్థులు

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: టపాసుల గిడ్డంగి, తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కనీసం కడసారి చూపు సైతం దక్కలేదంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు చూపరులను కలిచివేసింది. మాంసం ముద్దలతో కూడిన మృతదేహాలను వారి ఇళ్లకు తరలించగా కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో విషాదం అలుముకుంది. కువ్వాకుళ్లికి చెందిన మృతుడు సాధు నాగేంద్ర, ఎల్లకట్టవకు చెందిన శంకరయ్య ఇళ్ల వద్ద కుటుంబసభ్యులు, బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గూడూరునకు చెందిన ఏడుకొండలు బంధువులు గురువారం ఎల్లకట్టవకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం వస్తున్నారన్న సమాచారంతో గ్రామంలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులను భారీగా మొహరించారు. అంతకు ముందు ప్రమాద స్థలిని పోలీసులు తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉంచిన మందు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి బాంబ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీం బృందాలు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిడ్డంగి యజమాని వీరరాఘవులు (వీరయ్య) ఇంట్లో భారీగా టపాసులు, బాణాసంచా లభించింది. పోలీసులు ప్రత్యేకవాహనంలో తరలించారు.

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చెక్కు  అందిస్తున్న కలెక్టరు, ఎమ్మెల్యే

* ప్రమాద తీవ్రత గ్రామ ప్రజలను కలచివేసింది. గురువారం బాధితకుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు అక్కడికి వచ్చిన కలెక్టరు వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వాహనాలను ఎల్లకట్టవ గ్రామస్థులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని పక్కకు తప్పించేందుకు ప్రత్యేక బలగాలు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమస్య తీవ్రతరం కాకుండా కలెక్టరు వెంకటరమణారెడ్డి స్పందించారు. బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం కలెక్టర్‌, ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు వెళ్లి పరామర్శించారు. ఒక్కోక్కరికి రూ. 5 లక్షల చొప్పున సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు. బాధిత కుటుంబ సభ్యులకు  జీవనాధారం కోసం ఉద్యోగం, సాగు భూమి అందించాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు న్యాయం చేస్తామని కలెక్టరు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని