logo

శంకరా.. ఇదేం పంపిణీ సామీ?

బియ్యం కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరకులు అందజేయాలనే ఆశయంతో ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పథకం ఎత్తిపోయింది..

Published : 03 Jun 2023 02:11 IST

ఇంటి వద్దకే అంటే ఇలాగేనా
మండుటెండలో లబ్ధిదారుల తిప్పలు

బియ్యం తీసుకునేందుకు మండుటెండలో క్యూలో ఉన్న లబ్ధిదారులు

న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు): బియ్యం కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరకులు అందజేయాలనే ఆశయంతో ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పథకం ఎత్తిపోయింది.. ఇందుకు నిదర్శనం జిల్లా కేంద్రం చిత్తూరు గిరింపేటలోని పగడమాను వీధిలో చౌక దుకాణం(నెం.5) వద్ద బారులు తీరిన కార్డుదారులు.. ఈ దుకాణానికి కేటాయించిన బియ్యం వాహనం ఎక్కడుందో ఎవరికీ తెలియదు.. ఫలితంగా మండుటెండలో కార్డుదారులు అవస్థలు చెప్పనలవికావు.

పంపిణీ ఇలా..

జూన్‌ నెల కోటా గురువారం నుంచి మొదలైంది. ఎండీయూ వాహనాలు నామమాత్రంగా నడుస్తున్నాయి. పలు మండలాల్లో దుకాణాల వద్దే పంపిణీ కొనసాగుతోంది. ఎండీయూ వాహనాల పనితీరు, వాటి పర్యవేక్షణ పట్టించుకునేవారే లేరు. వాహనాలు కదిలినా, కదలకపోయినా ఆపరేటర్లకు వేతనాలు మాత్రం క్రమం తప్పకుండా అందుతుండటం గమనార్హం. ఈ తరుణంలో రెండ్రోజులుగా సర్వర్‌ సమస్య పంపిణీకి తీవ్ర అడ్డంకిగా మారింది.

జరుగుతోందిలా..

బియ్యం కార్డుదారుల ఇంటింటికీ ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటమే తప్ప.. క్షేత్రసాయిలో భిన్నంగా ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన జిల్లా యంత్రాంగం పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో కార్డుదారులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో 1379 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 5,34,256 మందికి బియ్యం కార్డులు పంపిణీ చేశారు. ఇంటివద్దకే సరకుల పంపిణీకి 336 ఎండీయూ వాహనాలు అందుబాటులో ఉంచారు. ఈ వాహనాల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారంతో పాటు లబ్ధిదారులకు అవస్థలే తప్ప ఏమాత్రం ఉపయోగం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

సర్వర్‌ పనిచేయక..

గిరింపేట పగడమాను వీధిలోని దుకాణానికి శుక్రవారం ఉదయం ఏడు గంటలకే లబ్ధిదారులు చేరుకున్నారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో.. చేసేదేమీ లేక బియ్యం తీసుకెళ్లేందుకు తెచ్చిన సంచులను దుకాణం వద్ద క్యూలో ఉంచారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దుకాణం వద్ద బియ్యం తీసుకునేందుకు తీవ్రమైన మండుటెండలో నిల్చొని అవస్థలు పడ్డారు. తమకు ప్రతి నెలా ఇలా తిప్పలు తప్పడం లేదని వారు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉండటం గమనార్హం. తమ బాధలు గట్టెక్కెదెన్నడోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు