logo

వాలీబాల్‌కు పుట్టినిల్లు నరశింగాపురం

మండలంలోని నరశింగాపురం.. వాలీబాల్‌ క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. శ్రీవినాయక యువజన క్రీడా సంఘం పేరిట క్రీడాకారులు వాలీబాల్‌ క్రీడా ప్రాంగణాన్ని స్వశక్తితో ఏర్పాటు చేసుకున్నారు.

Published : 03 Jun 2023 02:11 IST

15 ఏళ్లుగా వేసవి శిక్షణ శిబిరాలు

శిక్షణ పొందుతున్న చిన్నారులు

న్యూస్‌టుడే, చంద్రగిరి:  మండలంలోని నరశింగాపురం.. వాలీబాల్‌ క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. శ్రీవినాయక యువజన క్రీడా సంఘం పేరిట క్రీడాకారులు వాలీబాల్‌ క్రీడా ప్రాంగణాన్ని స్వశక్తితో ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం పిల్లల నుంచి పెద్దల వరకు వాలీబాల్‌ క్రీడలో భాగస్వాములు అవుతున్నారు. పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సహాయ సహకారాలతో శ్రీవినాయక యువజన క్రీడా సంఘం 15 ఏళ్లుగా వేసవి సమయంలో బాల, బాలికలకు ఉదయం, సాయంత్రం వాలీబాల్‌ క్రీడపై మెలకువలు నేర్పిస్తున్నారు. శిక్షణ శిబిరానికి హాజరయ్యే విద్యార్థులకు దాతల సహకారంతో ప్రతిరోజూ ఉదయం పూట పాలు, కోడిగుడ్డు, బ్రెడ్‌ అందిస్తున్నారు. శిక్షణ శిబిరం నిర్వహణకు గ్రామపెద్దల పరస్పర సహకారంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిర్వహించుకోవడం గమనార్హం. ప్రస్తుతం వేసవి శిబిరంలో శ్రీవినాయక యువజన సంఘం అధ్యక్షుడు కె.షణ్ముగం, గౌరవాధ్యక్షుడు జి.సుదర్శనం ఆధ్వర్యంలో కోచ్‌లు జి.మధు, నిర్భయ్‌, మురళి 80 మంది బాల, బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లో...

చదువు.. క్రీడలు సమానం

విద్యతోపాటు వాలీబాల్‌ క్రీడలో రాణించాలన్నదే కోరిక. రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ సమయానికి ముందుగా మైదానం చుట్టూ పరుగెత్తుతూ వ్యాయామం చేయిస్తున్నారు. ఆపైన పాలు, కోడిగుడ్డు, బ్రెడ్‌ అందించిన కొంత సమయం తర్వాత వాలీబాల్‌ క్రీడపై శిక్షణ ఇస్తున్నారు.

ధీరజ్‌, 8వ తరగతి

జట్లుగా ఏర్పాటై..

ఇక్కడ బాల, బాలికలకు వేర్వేరుగా వాలీబాల్‌ క్రీడపై గురువులు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత జట్లుగా ఏర్పాటుచేసి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో సత్తా చాటుతామనే నమ్మకం ఉంది. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు భానుప్రసాద్‌ విద్యార్థులు కోరిన ఆటపై శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.  

విష్ణుప్రియ, 8వ తరగతి

నిత్యం సాధన

విద్యతో పాటు వాలీబాల్‌ క్రీడల్లో మంచి గుర్తింపు పొందాలన్నదే లక్ష్యం. ఇప్పటికే పాఠశాల తరఫున మండలస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ఇతర జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా జట్లతో పోటీ పడ్డాం. వాలీబాల్‌ క్రీడపై నిత్యం సాధన చేస్తున్నా. ఆటలో నైపుణ్యం సాధించి జిల్లాస్థాయి పోటీల్లో తలపడాలన్నదే లక్ష్యం.

చెంచు లక్ష్మీప్రసన్న, 9వ తరగతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని