logo

మొదటి ఘాట్‌రోడ్డులో కారు ప్రమాదం

తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం తెలంగాణకు చెందిన భక్తులు కారులో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

Published : 03 Jun 2023 02:11 IST

ప్రయాణికులు సురక్షితం

ప్రమాదానికి గురైన కారు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం తెలంగాణకు చెందిన భక్తులు కారులో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతికి మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా దిగుతుండగా చివరి మలుపువద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడకు ముందున్న బారికేడ్‌ను ఢీకొంది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ తెరచుకోవడంతో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బంది కారును పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కాకర్లవారిపల్లి(పాకాల), న్యూస్‌టుడే: మండలంలోని దామలచెరువు పంచాయతీ కాకర్లవారిపల్లి సమీపంలోని సిలగొందిమూల ప్రాంతంలో కామాక్షమ్మచెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి(40) మృత దేహాన్ని స్థానికులు శుక్రవారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ రాజశేఖర్‌ మృతదేహాన్ని పరిశీలించారు. వారం క్రితం మృతి చెంది ఉండవచ్చని, అతని వద్ద ఇతర ఆధారాలేమీ దొరకలేదని తెలిపారు.


అప్పులపాలై ఆత్మహత్య

రేణిగుంట: వ్యక్తిగత కారణాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు... రేణిగుంటకు చెందిన శ్రావణ్‌కుమార్‌(35)కు వివాహమై 10 సంవత్సరాలైంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహిస్తూ అప్పులు పాలైయ్యాడు. జీవితంలో కుదుటపడక పోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రావణ్‌కుమార్‌ తూకివాకం సమీపంలోని చెరువు వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని వద్ద వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. గాజులమండ్యం ఎస్సై ధర్మారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని