logo

ఇదేం సంప్రదాయం

ఆంధ్ర, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ తిరునాళ్లకు నెల ముందునుంచే సందడి ప్రారంభమవుతుంది.

Published : 04 Jun 2023 03:08 IST

చెంగాళమ్మకు సారె సమర్పణలో వివాదం

చెంగాళమ్మకు పసుపు, కుంకుమ సారె తీసుకొస్తున్న కోళ్లమిట్ట మహిళలు

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ఆంధ్ర, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ తిరునాళ్లకు నెల ముందునుంచే సందడి ప్రారంభమవుతుంది. ముందుగా పట్టణంలోని కూడళ్ల వద్దకు భక్తులు అంబళ్లు తీసుకొచ్చి పూజలు చేసి, అందరికీ పంపిణీ చేస్తారు. కొద్దిరోజులకు మూగ చాటింపు, తర్వాత తిరునాళ్లకు వారం రోజుల ముందు అమ్మవారికి పలు ప్రాంతాల నుంచి సారెలు తీసుకొస్తుంటారు. ఇందులో ముందుగా కోళ్లమిట్ట నుంచి స్థానికులు అమ్మవారికి పసుపు, కుంకుమ తీసుకొచ్చి ఆలయంలో అందజేస్తారు. ఇది కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈదఫా ఈ సంప్రదాయానికి దేవాదాయ శాఖ ఉద్యోగులు తిలోదకాలు పలికారు. పసుపు, కుంకమ బదులుగా ఆఖండ జ్యోతికి నూనెను తీసుకున్నారు. ఇదికాస్తా వివాదానికి దారితీసి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. చెంగాళమ్మ తిరునాళ్లు ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆనవాయితీ మేరకు నిర్వాహకులకు తమ ప్రాంతం నుంచి పసుపు, కుంకమ తీసుకొస్తామని కోళ్లమిట్ట గ్రామస్థులు సమాచారం అందించారు. ఆ మేరకు అనుమతి పొందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోళ్లమిట్ట గ్రామస్థులు ఆ ప్రాంతంలోని చెంగాళమ్మ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమతోపాటు సారె తీసుకుని తప్పెట్లు, తాళాలు, బాణసంచా వేడుకల మధ్య బజారు వీధుల మీదుగా చెంగాళమ్మ ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ, సారెను ముందుగా అమ్మవారికి సమర్పించాల్సి ఉంది. అయితే వీరిని ఆలయ ఆవరణలోనే ఉంచి, గాండ్ల సంఘం వారు ఆఖండ జ్యోతికి తీసుకొచ్చిన నూనెను తీసుకున్నారు. అనంతరం వారిని అంతరాలయంలోకి పంపుతూ వచ్చారు. దరిమిలా ఆలయంలో కోళ్లమిట్ట వాసులు వందలాది మంది పడిగాపులు కాశారు. దాంతోపాటు దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. దీనిపై కోళ్లమిట్ట వాసులు ఆలయ ఉద్యోగులను ప్రశ్నించారు. తాము ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ సారె సమర్పించిన తర్వాత ఆఖండ జ్యోతికి నూనె తీసుకోవాలని, అలా చేయకుండా సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారని ఉద్యోగులను ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదు. చివరకు అమ్మవారికి పసుపు, కుంకుమ సారె తీసుకెళ్లిన కోళ్లమిట్ట వాసులను అంతరాలయంలోకి వెళ్లనీకుండా బయటి నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పంపేశారు. దీనిపై వివాదం నెలకొని వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు అంతరాలయం దర్శనం లేకుండా, వేరొకరిని మాత్రం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. సంప్రదాయాలను దేవాదాయ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి సంప్రదాయాలు కొనసాగించేలా చూడాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని