logo

రైలు ప్రమాదంలో జిల్లా వాసులు సురక్షితమా?

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌జబార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జిల్లా వాసులు సురక్షితమా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. 

Published : 04 Jun 2023 03:08 IST

రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

ప్రయాణికుల జాబితాను పరిశీలిస్తున్న ఎంపీ గురుమూర్తి, రైల్వే అధికారులు

ఈనాడు, తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (రైల్వే, కలెక్టరేట్‌), రేణిగుంట, గూడూరు గ్రామీణం: ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌జబార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జిల్లా వాసులు సురక్షితమా లేదా అన్న విషయమై స్పష్టత లేదు.  రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి.. ప్రయాణికుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. శుక్రవారం చోటుచేసుకున్న ప్రమాదంలో గూడ్స్‌ రైలు, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఇందులో 12864 బెంగళూరు- హావ్‌డా రైలు తిరుపతి మీదుగా 1వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు చేరుకొని ప్రయాణికులతో బయలుదేరింది. ఇందులో తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి, రేణిగుంట, గూడూరు రైల్వేస్టేషన్ల నుంచి ఎంతమంది రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణించారన్న దానిపై కచ్చిత సమాచారం రైల్వే అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. ఉదయం అందిన సమాచారం ప్రకారం రిజర్వేషన్‌ ఖరారైన ప్రయాణికులు 19 మంది, వెయిటింగ్‌ లిస్ట్‌ 25 మంది మొత్తం 44 మంది ఉన్నట్లు తెలిసింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు హెల్ప్‌ డెస్క్‌ ద్వారా సంప్రదించి తెలుసుకున్నారు. వెయిటింగ్‌ లిస్ట్‌ 25 మంది రైలు ఎక్కారా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం తిరుపతి ఎంపీ గుర్తుమూర్తి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను పరిశీలిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు తెలిపిన సమాచారం మేరకు తిరుపతి నుంచి 18 మంది, రేణిగుంట 8, గూడూరు ఇద్దరు మొత్తం 28 ప్రయాణికులు ఉన్నారని, వారు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ 28 మంది ప్రయాణికుల్లో ఏసీ బోగీల్లో ప్రయాణించిన వారు సురక్షితంగా ఉన్నప్పటికీ, స్లీపర్‌, జనరల్‌ టికెట్‌ ద్వారా ప్రయాణించిన వారి వివరాల లెక్క లేదు. సాధారణంగా హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో తిరుపతికి వలస వచ్చి కూలీ పనులు చేసుకునే వారు, పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్స్‌, హోటల్లో మాస్టర్లుగా పనిచేసే కార్మికులు ప్రయాణిస్తుంటారు. ఈ జాబితాకి చెందిన వారు ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు రైళ్ల రద్దు

రైలు ప్రమాదం నేపథ్యంలో తిరుపతి మీదుగా హావ్‌డాకు రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేసినట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం హావ్‌డా నుంచి రావాల్సిన హావ్‌డా- తిరుపతి (20889) రైలు, ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరాల్సిన తిరుపతి- హావ్‌డా (20890) రైలును రద్దు చేశారు. శనివారం హావ్‌డా నుంచి తిరుపతి మీదుగా వెళ్లాల్సిన హావ్‌డా- బెంగళూరు (12863) రైలు, బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా వెళ్లాల్సిన బెంగళూరు- హావ్‌డా (12864) రైళ్లు రద్దు అయ్యాయి.

గూడూరులో సేవాకేంద్రం

గూడూరు జంక్షన్‌ నుంచి బయలుదేరిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శ్రీదాస్‌, ఎస్‌కే దాస్‌, సుశీల శ్రీకాకుళంలో దిగిపోగా నాలుగో ప్రయాణికుడు దులాల్‌బీ ప్రయాణిస్తున్న ఎస్‌1 బోగీకి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇతని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా నెల్లూరు ప్రాంతంలో టైల్స్‌ పనిమీద వచ్చినట్లు తెలిపారు. రైలు ప్రమాదం సంబంధించి వివరాల కోసం గూడూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో 98499 04062, 086242 50795 ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని ఆర్డీవో కిరణ్‌కుమార్‌ తెలిపారు.

కలెక్టరేట్‌లో..

రైలు ప్రమాదంలో జిల్లాకు చెందిన ప్రయాణికుల సమాచారం తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే హెల్ప్‌లైన్‌ నంబరు: 62811 56480ను సంప్రదించాలని కోరారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో హెల్స్‌లైన్‌ నెంబరు 78159 15571ను అందుబాటులో ఉంచారు.

రేణిగుంటలో..

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌డెస్కును ఏర్పాటు చేశారు. ఎటువంటి వివరాలు కావాలన్నా 94935 48008 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే అధికారులు
తెలిపారు.

మధ్యలోనే దిగి..

రేణిగుంట పరిధిలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న చంద్రమౌలి కుటుంబంతో కలిసి హావ్‌డా వరకు టికెట్టు రిజర్వేషన్‌ చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోనే దిగిపోయారు. మంతుకుమార్‌ హావ్‌డా వరకు టికెట్టు రిజర్వు చేసుకున్నారు. ఇతను బాలేశ్వర్‌కు ముందుకు ఉన్న స్టేషన్‌లో దిగిపోయారు. అనురాగ్‌ తిరుపతి నుంచి హావ్‌డా వరకు టికెట్టు రిజర్వేషన్‌ చేసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన అందులోనే ఏసీ కోచ్‌లో ఉన్నారు. ఆ కోచ్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరుపై ‘ఈనాడు’ అతన్ని సంప్రదించగా ఆందోళనలో సమాచారం చెప్పలేకపోయారు. రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో గమ్యస్థానానికి వెళ్లారు.


భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డాం

మేము నలుగురు ప్రయాణికులం. అందరూ తిరుపతి జిల్లా రేణిగుంట- నాయుడుపేట జాతీయ రహదారి పనులు చేస్తున్నాం. యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో రేణిగుంట నుంచి ఖరగ్‌పూర్‌కు రిజర్వేషన్‌ చేసుకున్నాం. నిరీక్షణ జాబితాలో ఉండడంతో ఎస్‌-7 బోగీలో బయలుదేరాం. ప్రమాద సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. నిమిషం పాటు కాళ్లు, చేతులు ఆడలేదు. బయటకు దిగి చూడగా భయంకరమైన ప్రమాదంగా కనిపించింది. జనరల్‌ బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ భయం ఇప్పటికీ ఉంది.

సులాల్‌ ముర్ము

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని