logo

అరుణాచల ప్రయాణం.. అంతులేని విషాదం

ఉద్యోగ, వ్యాపారం నిమిత్తం జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో స్థిరపడిన కుటుంబాలు వారివి. ఒకే అపార్టుమెంట్‌లో నివసిస్తుండటంతో పరస్పరం పరిచయాలు పెరిగాయి.

Published : 04 Jun 2023 03:08 IST

దైవ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన

జేసీబీతో లక్ష్మీదేవి మృతదేహం వెలికితీత

కల్లూరు, నంద్యాల, న్యూస్‌టుడే: ఉద్యోగ, వ్యాపారం నిమిత్తం జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో స్థిరపడిన కుటుంబాలు వారివి. ఒకే అపార్టుమెంట్‌లో నివసిస్తుండటంతో పరస్పరం పరిచయాలు పెరిగాయి. శుభకార్యాలు, తీర్థయాత్రలకు కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఇరుగుపొరుగు వారంతా కలిసి కాణిపాకం, అరుణాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక వాహనాన్ని మాట్లాడుకుని తీర్థయాత్రకు బయల్దేరారు. సంతోషంగా సాగిపోతున్న వారి యాత్రపై మృత్యువు పంజా విసిరింది. నంద్యాల జిల్లాకు చెందిన నలుగురిని పొట్టన పెట్టుకుంది.

ఒకరోజు ముందుగానే బయల్దేరి

ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం వీరంతా శనివారం రాత్రి బయల్దేరాల్సి ఉంది. పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకుని శుక్రవారం రాత్రే బయల్దేరారు. శనివారం కాణిపాకం చూసుకుని ఆదివారం అరుణాచలం చేరుకోవాలని భావించారు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదం వీరి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీదేవి(54)కి భర్త రామమోహన్‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విమలమ్మ(52) భర్త నాగన్న విద్యుత్తు శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. ఎస్‌బీఐ కాలనీలో నివసిస్తున్న శివమ్మ(45) భర్త శివస్వాములు శిరివెళ్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరికి కుమార్తె ఉంది. నర్సు క్వార్టర్స్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి(39) వ్యాపారం చేసేవారు. ఇతనికి భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు సంతానం.

డ్రైవర్ల తప్పిదమే కారణం

ప్రమాద స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ కె.శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై రవిప్రకాష్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పీలేరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న లారీ.. ఘాట్‌ రోడ్డు రావడంతో డ్రైవరు గేరు మార్చగా వేగం తగ్గింది. అంతలోనే భక్తులతో వస్తున్న వాహనం అతివేగంగా దూసుకురావడంతో లారీని వెనుక భాగంలో ఢీకొంది. మరోసారి లారీ ముందు భాగాన ఢీకొంది. ఇద్దరు డ్రైవర్ల తప్పిదంతోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు. వాహనం డ్రైవరు ఆదినారాయణ, లారీ డ్రైవరు పుమారియప్పన్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ప్రమాద సూచికలు లేని సంఘటన స్థలం మలుపు

ఈ మలుపులో నిత్యం ప్రమాదాలే

ఎంజేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి దిగువున ఉన్న మలుపు వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కళాశాల ఎదురుగా వాహనాలు అతివేగంగా వెళ్లకుండా బారికేడ్లు ఉండేవి. ప్రస్తుతం వాటిలో ఒకటి పక్కన పెట్టారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, స్పీడు బ్రేకుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోలేదు. శనివారం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఏప్రిల్‌ 15న పులిచెర్ల మండలం దిగువపోకలారిపల్లెకు యువకుడు పి.రాజేష్‌ తన కారులో వస్తుండగా ఎదురుగా వాహనం దూసుకొచ్చి ఢీకొంది. కారు బెలూన్‌ తెరుచుకోవడంతో రాజేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అంతకుముందు మూడేళ్ల క్రితం ఎంజేఆర్‌ కళాశాల ఎదురుగా పీలేరులో వంట పనికి వెళ్లి వస్తూ పెద్దపంజాణికి చెందిన శ్రీనివాసులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. 2020లో పాకాల మండలంలో ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగి ద్విచక్రవాహనంపై కలికిరికి వెళ్తూ ఎదురుగా లారీ ఢీకొని అక్కడక్కడే దుర్మరణం చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని