logo

ఆ టీచర్లకు అక్కడేం పని?

ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని తల్లిదండ్రులు చెబుతున్నారు.. డీఈవో ఆఫీస్‌లో 136మంది టీచర్లను కూర్చోబెడుతున్నారు.. అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్‌ వేయొచ్చు కదా అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అధికారులను ప్రశ్నించారు.

Published : 04 Jun 2023 03:08 IST

వివరాలు చెప్పలేకపోయిన డీఈవోలపై ఆగ్రహం
ఉమ్మడి జిల్లాలో ప్రవీణ్‌ ప్రకాష్‌ సుడిగాలి పర్యటన

గంగవరంలో విద్యాకానుక బూట్లు పరిశీలిస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌, కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని తల్లిదండ్రులు చెబుతున్నారు.. డీఈవో ఆఫీస్‌లో 136మంది టీచర్లను కూర్చోబెడుతున్నారు.. అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్‌ వేయొచ్చు కదా అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీ ఉర్దూ పాఠశాల సందర్శన సమయాన పైవిధంగా మాట్లాడారు. రాయలసీమలో ఎన్ని ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు? ఎక్కడ అవసరం? డీఈవో ఆఫీస్‌లో కూర్చొంటున్న వారిని ఎందుకు అక్కడ సర్దుబాటు చేయలేదని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గంగవరం మండలం మేలుమాయి జడ్పీ ఉన్నత పాఠశాల తనిఖీలో పాత పాఠ్యపుస్తకాలు ఉండటం, సెలవుల్లో పిల్లలు పాఠశాలలో కన్పించడంతో వారిని ఎందుకు పిలిపించారు.. ఇప్పుడు ఈ పిల్లలను నేను కలవాలా.. నా ఇష్టం వచ్చిన వారిని కలుస్తా, మాట్లాడతానని హెచ్‌ఎం శ్రీధర్‌బాబును మందలించారు. మేలుమాయిలో కలెక్టర్‌ షన్మోహన్‌తో కలిసి విద్యాకానుక సామగ్రి పరిశీలించారు. ముఖ్య కార్యదర్శి ఆదేశాల నేపథ్యంలో.. హెచ్‌ఎం శ్రీధర్‌బాబుపై డీఈవో విజయేంద్రరావు ఆర్జేడీకి నివేదిక ఇవ్వనున్నారు.

పాఠాలు చెప్పకుంటే సీఆర్పీ వ్యవస్థ రద్దే

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్‌ సెలవులో వెళ్తే సీఆర్పీలు వెళ్లి పాఠాలు చెప్పకుంటే ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేయాల్సి వస్తుందని పలమనేరులో సీఆర్పీలను ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. వారితో మాట్లాడుతూ బీఈడీ చదివిన వారే సీఆర్పీలుగా ఉన్నారని, ఈ పాఠశాలలు ఎక్కడా మూతపడరాదని స్పష్టం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రవీణ్‌ప్రకాష్‌.. ఇద్దరు డీఈవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల తనిఖీ సమయాన డీఈవో శేఖర్‌ని పలు ప్రశ్నలు వేయగా ఆయన చెప్పేందుకు తడబడగా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో తనిఖీ సమయంలో జిల్లాలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, వారిలో తొమ్మిదో తరగతి వారు ఎంతమంది అని డీఈవో విజయేంద్ర రావును ప్రశ్నించగా ఆయన నెమ్మదిగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించారు. తిరుపతి జిల్లాలో నాడు-నేడు మొదటి విడత పనులు పూర్తికాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన.. ఆ వివరాలు తీసుకుని విజయవాడకు రావాలని సమగ్ర శిక్ష ఉమ్మడి జిల్లా ఏపీసీ వెంకట రమణారెడ్డిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని