logo

కట్టడి చేస్తేనే.. గిట్టుబాటు

ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన మామిడికి ఆశించిన ధరలు దక్కడంలేదు. దీంతో మామిడి రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.. రైతులు మాత్రం ఏటా ఆశించిన ధర దక్కుతుందని ఆశపడినా అవన్నీ అడియాశలు అవుతున్నాయి..

Updated : 09 Jun 2023 06:10 IST

క్రమేపీ ధర పతనం
ఆందోళనలో మామిడి రైతులు
దృష్టిపెట్టని అధికార గణం

న్యూస్‌టుడే, పుత్తూరు: ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన మామిడికి ఆశించిన ధరలు దక్కడంలేదు. దీంతో మామిడి రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.. రైతులు మాత్రం ఏటా ఆశించిన ధర దక్కుతుందని ఆశపడినా అవన్నీ అడియాశలు అవుతున్నాయి.. మామిడి సీజన్‌ ప్రారంభం ఉన్న ధరలే సీజన్‌ ముగిసే వరకు ఉంటాయని రైతులు ఆశించారు.. అయితే ఒక్కసారిగా వారి ఆశలపై తగ్గిన ధరలు నీళ్లు చల్లాయి.

ఫలరాజుగా పేరొందిన బేనీషా రకం మామిడి ధరలు నేలను చూస్తున్నాయి. ప్రస్తుతం మొదటి రకం టన్ను కాయలు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ధర పలికింది. అదే పల్ప్‌ ఫ్యాక్టరీకి టన్ను రూ.5వేల నుంచి రూ.10వేలు మించడం లేదు. నిరుడు టన్ను రూ.35 వేల నుంచి రూ.80వేలు పలికింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం తోతాపురి టేబుల్‌ రకం రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. రుమాని టన్ను రూ.5వేలు కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో కోత కూలీలు రావడం లేదు. దీంతో కాయల్ని చెట్లలోనే వదిలేస్తున్నారు. ఆపై కొంత సమయానికే అవి చెట్ల కిందనే రాలిపోతుండ టం గమనార్హం.

రాష్ట్రంలోనే జిల్లాలో అధిక విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. దీనికి తోడు పల్ప్‌ ఫ్యాక్టరీలు జిల్లాలో అధికంగా ఉన్నాయి. మొదటగా కృష్ణాజిల్లా నూజివీడులో మామిడి సీజన్‌ ప్రారంభమవు తుంది. అక్కడి నుంచి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు వివిధ రకాల మామిడి కాయలు తెచ్చి పల్ప్‌ తయారుచేస్తుంటారు. దీనికితోడు సమీప తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని శ్రీనివాసపురం నుంచి కాయలు కొనుగోలు చేస్తారు. అక్కడ తక్కువ ధరలకు ఇచ్చేస్తుండటంతో.. జిల్లాలోని కాయలను సంబంధిత ఫ్యాక్టరీల యజమాను కొనడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి కాయలు వస్తుండటంతో గిట్టుబాటు ధర తమకు కనీసం దక్కడం లేదని జిల్లా అధికారుల సమీక్షల్లోనే వెల్లడించడం విశేషం. గతంలో జిల్లాలో మామిడి రైతులకు ధరలు దక్కకపోవడంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కాయలు రాకుండా కట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ దిశగా జిల్లా యంత్రాంగం ఈ ఏడాదీ చర్యలు చేపడితేనే మామిడి రైతులకు ఆశించిన ధరలు దక్కే అవకాశం ఉంది. అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తే తప్ప జిల్లా రైతులకు న్యాయం జరిగే పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.


బేనీషా మామిడి కాయలు

జిల్లాలోని జీడీనెల్లూరుకు చెందిన ఓ రైతు మామిడి సాగు చేశాడు. పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో మండల కేంద్రమైన జీడీనెల్లూరులో ఆటోలో తీసుకొచ్చి ఉచితంగా అందరికీ పంచేశాడు. ఇదీ జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. జిల్లా యంత్రాంగం మాత్రం సమీక్షలు నిర్వహించి ఏదోఒక ధర ప్రకటించేసి చేతులు దులిపేసుకుంటోంది.. ఫలితంగా ఏడాది మొత్తం కష్టపడిన రైతులకు ఆశించిన మేర ధర దక్కడంలేదు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని