logo

ప్రసూతి ఆసుపత్రిలో బిడ్డలకు అభద్రత

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బిడ్డ చోరీ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో చోరీ యత్నంగానే మిగిలింది.

Updated : 09 Jun 2023 06:11 IST

అమలు కాని జియో ట్యాగింగ్‌ విధానం

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బిడ్డ చోరీ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో చోరీ యత్నంగానే మిగిలింది. గతంలో మాదిరి బిడ్డల మాయం.. పురిటి బిడ్డల మార్పు తరహా ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు జియో ట్యాగ్‌లు వేసే విధానం ప్రస్తుతం అమలులో లేదు. ఇదే క్రమంలో రోగి సహాయకులను లెక్కకు మించి అనుమతిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం తీరుతో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు.

న్యూస్‌టుడే, తిరుపతి (వైద్యం)

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో రోగుల సహాయకులు అత్యధిక సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. మగవారికి ప్రవేశం కల్పించాలని నిత్యం భద్రతా సిబ్బందితో పలువురు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం నిర్దిష్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో పసిపిల్లల చోరీ ఘటనలకు ఆస్కారం ఉంది. సాధారణ, శస్త్రచికిత్స కాన్పుల తర్వాత ఒకట్రెండు రోజులకు వార్డులోకి తల్లీబిడ్డలను తరలిస్తారు. వార్డులోకి ఎవరెవరు వెళ్తున్నారు.. రోగితో ఎంతమంది ఉంటున్నారనే విషయాలను ఆస్పత్రి యాజమాన్యం విస్మరిస్తోంది. కాన్పుల వార్డు వరకే తమ పరిధి అంటూ ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరిస్తోంది.

* ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే..: రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైజ్‌ (జియో ట్యాగ్‌) విధానాన్ని 2017 నుంచి అమలులోకి తెచ్చారు. ప్రసవం జరిగిన వెంటనే తల్లీబిడ్డల చేతులకు వీటిని అమర్చుతారు. తల్లి, బిడ్డ మధ్య దూరం వంద అడుగుల కన్నా ఎక్కువ ఉంటే ఈ పరికరం శబ్దం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డు నుంచి వేర్వేరుగా తల్లీబిడ్డలు బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లడం అసాధ్యంగా మారేది.

జియో ట్యాగ్‌ పరికరాలు

నాలుగేళ్లుగా విస్మరించడంతో..:  బిడ్డల చోరీలు.. మార్పుల ఆరోపణలను నియంత్రించే లక్ష్యంగా అమల్లోకి తెచ్చిన జియో ట్యాగింగ్‌ వ్యవస్థను విస్మరించారు. ఈ విధానాన్ని కరోనాకు ముందు నుంచే నిర్వీర్యం చేశారు. ఆ సమయంలో పుట్టిన మగబిడ్డను మార్చేశారనే ఆరోపణలు.. ఓ బిడ్డ మృతదేహం  డ్రైనేజీలో కన్పించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  ఆ తర్వాత కరోనా విజృంభించడంతో కాన్పుల సంఖ్య తగ్గడం ఈ తరహా ఆరోపణలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కాన్పులు జరుగుతుండటంతో మళ్లీ  దొంగల కన్ను ప్రసూతి ఆస్పత్రిపై పడింది. ఇప్పటికైనా ప్రసూతి ఆస్పత్రి యాజమాన్యం పటిష్ఠ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


పునరుద్ధరణకు కృషి:

తల్లీబిడ్డలకు ప్రస్తుతం సాధారణ ట్యాగ్‌ వేస్తున్నాం. జియో ట్యాగ్‌ల వ్యవస్థను కరోనా సమయం నుంచి నిలిపి వేశాం. దీని పునరుద్ధరణకు కృషి చేస్తాం.

పార్థసారథిరెడ్డి, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి  


ఆసుపత్రిలో ఇన్‌పేషంట్లు: 340 - 360 మంది    
రోజూ ప్రసవాలు: 30 -40


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని