logo

ఆస్తులపై అడ్డగోలు బాదుడే..!

స్తిరాస్థి క్రయవిక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా భావిస్తోంది. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణల పేరిట ఏటికేడాది పెంచేస్తోంది.

Updated : 09 Jun 2023 05:54 IST

విలువ పెంపుపై తీవ్ర వ్యతిరేకత
ఆదాయ వనరుగా మారిన రిజిస్ట్రేషన్ల శాఖ

గూడూరు, న్యూస్‌టుడే: స్తిరాస్థి క్రయవిక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా భావిస్తోంది. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణల పేరిట ఏటికేడాది పెంచేస్తోంది. దీంతో ఇటు స్థలాలతో పాటు నిర్మాణాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదేం బాదుడు అంటూ రైతులు బావురుమంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏటా 1.10 లక్షల డాక్యుమెంట్ల ద్వారా రూ.300 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోంది. తాజా పెంపుతో రూ.50 కోట్ల మేర అదనపు ఆదాయం రాబట్టడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల క్రయవిక్రయాలు సర్వ సాధారణం కాగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఉంటాయి. అన్నీ కలిపి ఆస్తి విలువలో 7% వరకు చెల్లించాల్సి ఉంటోంది. ఇలా ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వం లాభాలు ఆశించడం మొదలు పెట్టింది. ఏటికేడాది పెంచుకుంటూ బాధ్యత విస్మరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాలతో పాటు పల్లెల్లో భూముల ధరలు లెక్కలేనంతగా పెరిగిపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


భాగ పరిష్కారానికి అప్పు

తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కొడుకులు, కుమార్తెలకు పంపిణీ చేయాలన్నా ధరలు విపరీతంగా పెరిగాయి. తండ్రి పేరిట ఆస్తి మొత్తం ఉండటంతో సామాజిక భద్రత పింఛన్‌ రద్దు చేశారు. ఇద్దరు కొడుకులం కాగా విడిపోయి పదేళ్లయ్యింది. ఆస్తి మార్పిడికి వెళ్తే రూ.వేలల్లో ఫీజులు ఉండటంతో అప్పు చేయాల్సి వస్తోంది.

జలదంకి భక్తవత్సలరెడ్డి, వేముగుంటపాళెం, నాయుడుపేట


తిరుపతి నగరంలోని శాంతినగర్‌, శ్రీనగర్‌కాలనీ, రాయల్‌నగర్‌ ప్రాంతాల్లో గజం ధర రూ.62 వేలుగా ఉంది. తాజా పరిస్థితుల్లో రూ.65 వేల వరకు పెంచేశారు. నిర్మాణాల విషయానికొస్తే ఇదే ప్రాంతాల్లో మొదటి అంతస్తు ధర రూ.4,600 ఉంది. సవరణల పేరిట రూ.5 వేల వరకు పెంచినట్లు సమాచారం.


శ్రీకాళహస్తి పట్టణంలోని నగరి వీధిలో చదరపు గజం ధర రూ.12 వేలు కాగా ఇక్కడే మొదటి అంతస్తుకు రూ.1,900 ఉంది. నెహ్రూ రోడ్డు, పురంవారివీధిలో ఇవే ధరలు ఉండగా.. తాజా సవరణతో 10-20 శాతం మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే సమయంలో పెంచగా మళ్లీ బాదడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


వెంకటగిరి పట్టణంలోని రాజావీధి, పద్మశాలి వీధి, మార్కెట్‌ వీధి తదితర ప్రాంతాల్లో చదరపు గజం మార్కెట్‌ విలువ రూ.11,700 కాగా ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.12,500 వరకు ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతాల్లో తొలి అంతస్తు ధర చదరపు అడుగుకు రూ.1,900 ఉండగా రూ.2,100 వరకు పెంచారు.


సవరణలు అమలు చేస్తాం

నిబంధనల మేరకు సవరణలు అమలు చేయడం జరుగుతోంది. నిర్ణయించిన ధరల మేరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

శ్రీరామ్‌కుమార్‌, జిల్లా రిజిస్ట్రార్‌, తిరుపతి


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని