పారిశ్రామిక నడవాల అభివృద్ధికి ఏడీబీ రుణం
పారిశ్రామిక నడవాల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి ఎట్టకేలకు రుణం అందింది. తెదేపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక నడవాలకు అడుగులుపడగా వాటిల్లో మౌలిక వసతులు, రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి.
సౌత్ క్లస్టర్‌లో రూ.536 కోట్లతో మౌలిక వసతులు
నాయుడుపేట బాహ్య రహదారికి రూ.120 కోట్లు
విస్తరించనున్న నెలబల్లి వద్ద పునబాక రహదారి
గూడూరు, న్యూస్‌టుడే: పారిశ్రామిక నడవాల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి ఎట్టకేలకు రుణం అందింది. తెదేపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక నడవాలకు అడుగులుపడగా వాటిల్లో మౌలిక వసతులు, రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి. పలు రోడ్ల నిర్మాణానికి టెండర్లు సైతం పూర్తయ్యాయి. అప్పటి నుంచి కదలిక లేకపోగా తాజాగా పురోగతి మొదలైంది. చిత్తూరు దక్షిణ నోడ్‌లో మౌలిక వసతులకు టెండర్లు పిలిచారు. ఏడీబీ రుణంతో పారిశ్రామిక నడవాల పరిధిలో మౌలిక వసతులు సమకూరనున్నాయి. బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టంబేడు మండలాల్లో పారిశ్రామిక నగరం ఏర్పాటు కానుంది. చిత్తూరు దక్షిణ బ్లాక్‌లో స్టార్టప్ ఏరియా 938 హెక్టార్లలో రూ.536 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు కానుంది. ఈ క్లస్టర్‌కు అనుసంధానంగా రహదారి విస్తరించనున్నారు. పెళ్లకూరు మండలం నెలబల్లి జాతీయ రహదారి 71 నుంచి దక్షిణ వైపున శ్రీకాళహస్తి-తడ రహదారి మార్గం పల్లమాల వరకు రోడ్డు విస్తరించనున్నారు. దీనికి గతంలోనే టెండర్లు పిలవగా సుమారు 9.5 కి.మీ.లకు రూ.67 కోట్లు వెచ్చించనున్నారు. నాయుడుపేట పారిశ్రామికవాడ బాహ్య రహదారి 8.5 కి.మీ. మేర విస్తరించనున్నారు. దీనికి టెండర్లు పూర్తికాగా రూ.120 కోట్లు వెచ్చించనున్నారు. పండ్లూరు నుంచి తిమ్మాజికండ్రిగ వరకు రహదారి ఏర్పాటు కానుంది. పండ్లూరు దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి రానుంది.
* వీసీఐసీడీపీలో భాగంగా చిత్తూరు దక్షిణ క్లస్టర్‌లో స్టార్టప్ ఏరియాను రౌతుసూరమాల, గౌడమాల, కొత్తపాళెం, బీఎస్‌పురం, ఆలత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ తొలిదశలో 30 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. మౌలిక వసతులకు 21 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఏటీఎం, మెడికల్ దుకాణం, విశ్రాంతి గదులు, ఫుడ్, బేవరేజస్ తదితర దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఓ నగరం ఏర్పాటుకు అప్పట్లోనే అడుగులుపడగా నాలుగేళ్లు అనంతరం ఎట్టకేలకు కదలిక వచ్చింది.
* ఎంపిక చేసిన ప్రాంతంలో పరిశ్రమల కోసం 1,380, లాజిస్టిక్స్‌కు 35, వాణిజ్య అవసరాలకు 40, నివాసాలకు 176 ఎకరాల చొప్పున వినియోగించనున్నారు. ఇవికాకుండా రహదారులు, పార్కింగ్, పాత్‌వేలు, పచ్చదనం కోసం మరో 255 ఎకరాలతో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.
రెండు రోడ్లకు రూ.187 కోట్లు
ఏపీఆర్‌డీసీ ఆధ్వర్యంలో రెండు రోడ్లకు రూ.187 కోట్లు విడుదల కానున్నాయి. నాయుడుపేట క్లస్టర్‌లోని బాహ్య రహదారి, దక్షిణ క్లస్టర్ అనుసంధాన రహదారిని, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. 100 కి.మీ. వేగంతో వెళ్లేలా రహదారులు నిర్మించనున్నారు. ఈ రెండు రోడ్లకు 2019లో టెండర్లు పిలవగా నిధుల రాక ఆలస్యమైంది. ఏడీబీ సాయంతో మళ్లీ అడుగులుపడ్డాయి.
టెండర్ల ప్రక్రియ నడుస్తోంది
నడవాల ప్రగతి పనులకు రుణ సాయం చేయడాని ఏడీబీ ముందుకొచ్చింది. టెండర్లు వివిధ దశల్లో నడుస్తున్నాయి.
చంద్రశేఖర్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.