logo

ఇదా స్పందన?

కరకంబాడీకి చెందిన వృద్ధుడు వెంకటేష్‌కు ఆరు నెలల కిందట వరకు పింఛన్‌ అందేది. అతనికి వ్యవసాయ భూమి ఉందంటూ అధికారులు రద్దు చేశారు.

Updated : 10 Jun 2023 04:11 IST

సిఫార్సులతో సరి పెట్టడంతో కానరాని పరిష్కారాలు

ప్రతి సోమవారం విన్నవిస్తున్న బాధితులు

ప్రజల వినతులు పరిశీలిస్తున్నకలెక్టర్‌ వెంకటరమణారెడ్డి (పాత చిత్రం)


* కరకంబాడీకి చెందిన వృద్ధుడు వెంకటేష్‌కు ఆరు నెలల కిందట వరకు పింఛŸన్‌ అందేది. అతనికి వ్యవసాయ భూమి ఉందంటూ అధికారులు రద్దు చేశారు. సెంటు భూమి లేదంటూ ధ్రువపత్రం సమర్పించినా పింఛన్‌ పునరుద్ధరించలేదు. పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.


*  తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెకు చెందిన కరుణాకర్‌రెడ్డికి చెందిన స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురైందని నెల క్రితం స్పందనలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ సిఫార్సు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించామని, భూమి కబ్జాకు గురికాలేదంటూ అధికారులు సమాధానం చెప్పారు. దీనిపై ప్రతి సోమవారం వినతిపత్రాలు ఇస్తున్నా స్పందన లేదని బాధితుడు వాపోతున్నారు.



*  తిరుపతి గ్రామీణ మండలం తనపల్లె పంచాయతీలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని రెండు వారాల కిందట గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలించి అడ్డుకోవాలని ఆదేశించినా మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది.


తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు అధికారులు స్వయంగా తెలుసుకుని.. పరిష్కరించేందుకు చేపట్టిన స్పందన కార్యక్రమంపై ఫిర్యాదుదారుల్లో అసంతృప్తి నెలకొంది. సామాజిక, వ్యక్తిగత, రెవెన్యూ సమస్యలపై కలెక్టరేట్‌లో ఇచ్చిన అర్జీలను స్వీకరించిన అధికారులు సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. కొన్ని సమస్యలు తీరకున్నా పరిష్కరించినట్లు నమోదు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీటిపై పలుమార్లు కలెక్టరేట్‌లో విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కొన్నింటిపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఉన్నతాధికారులు సిఫార్సులతో సరిపెట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు.
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వందకుపైగా ఫిర్యాదులు అందుతున్నాయి. కలెక్టర్‌, జేసీ, డీఆర్వో, ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు, పీఆర్‌, విద్యుత్తు, వ్యవసాయశాఖలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో భూములకు సంబంధించి సమస్యలు ప్రతి వారం ఎక్కువ భాగం ఉంటున్నాయి. అసలు భూసంబంధ సమస్య ఒకటి కూడా న్యాయస్థానానికి వెళ్లకుండా పరిష్కారం కావడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు.
* సాధారణంగా స్పందనలో ఫిర్యాదు చేస్తే..  కలెక్టర్‌ సిఫార్సు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. వాటి పురోగతిని ఉన్నతాధికారులకు తెలియజేయడం తోపాటు కంప్యూటర్‌లో నమోదు చేయాలి. అయితే ఎక్కువ మంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండానే ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడంతోనే సమస్యలు పరిష్కారం కాక బాధితులు తరచూ కలెక్టరేట్‌కు వస్తున్నట్లు సమాచారం.

ఫిర్యాదులే ఆదాయ వనరులు

మండల, రెవెన్యూ స్థాయిలో కొందరు అధికారులకు ఫిర్యాదులే ఆదాయ వనరులుగా మారుతున్నాయి. భూ వివాదాలు, సివిల్‌ తగదాలపై స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన మండలస్థాయి అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం మొదలు భూముల సర్వే వరకు ఎంతో కొంత ఇస్తేనే పనులు జరగడం లేదని పలువురు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని