సోమ, శుక్రవారాల్లో తహసీల్దార్లు సెలవు పెట్టొద్దు
సోమ, శుక్రవారాల్లో తహసీల్దార్లు సెలవు పెట్టడానికి వీల్లేదు.. అత్యవసరమైతే నా నుంచి, జేసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి’ అని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు.
మాట్లాడుతున్న కలెక్టర్ షన్మోహన్
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ‘సోమ, శుక్రవారాల్లో తహసీల్దార్లు సెలవు పెట్టడానికి వీల్లేదు.. అత్యవసరమైతే నా నుంచి, జేసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి’ అని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. రోడ్డు ప్రాజెక్టులకు భూసేకరణ, ఇతర అంశాలపై శుక్రవారం నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడారు. చెన్నై-బెంగళూరు, చిత్తూరు-తచ్చూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో క్లియరెన్స్ పనుల్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి భూముల్ని అప్పగించాలన్నారు.
* ఐదేళ్లలోపు పిల్లలకు జనన ధ్రువపత్రం సహా ఆధార్ కార్డు ఇప్పించే బాధ్యత సీడీపీవోలదేనని కలెక్టర్ అన్నారు. సర్వర్ పనిచేయడం లేదనే కారణాలు చెప్పొద్దన్నారు. శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, ఐసీడీఎస్ పీడీ నాగశైలజ పాల్గొన్నారు.
* క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉన్నా జిల్లాలో ఎన్‌సీడీ-సీడీ సర్వే ఆలస్యం కావడంపై వైద్యశాఖ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో ఎన్‌సీడీ-సీడీ సర్వే 80 శాతం పూర్తిచేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికో నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో రాజశేఖర్‌రెడ్డి, డీఐవో రవిరాజు పాల్గొన్నారు.
* నాడు-నేడు పనుల్ని ఈ నెల 12 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సదుం, సోమల, యాదమరి, చిత్తూరు, పులిచెర్ల మండలాల్లో సిమెంట్ కొరత సమస్య పరిష్కరించాలని, బంగారుపాళ్యంలో పనుల నిర్వహణకు రూ.15 లక్షలు, సిమెంటు సరఫరా చేయాలన్నారు. 12న పాఠశాలల్లో విద్యా కిట్ల పంపిణీకి ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలన్నారు. పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి జగనన్న ఆణిముత్యాలు ద్వారా రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి అందించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో 15న, జిల్లా స్థాయిలో 17న ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎంపీడీవోలతో ప్రతి నెలా మొదటివారంలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలు, స్వామిత్వ సర్వే, ఉపాధి పనుల్లో ప్రగతి సాధించాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.