logo

ఇంక్రిమెంట్‌ రాదు..జీతం పెరగదు

వార్షిక ఇంక్రిమెంట్ల కోసం జడ్పీ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు.. అసలు ఎప్పుడిస్తారోనని ఆశగా ఉన్నారు..

Published : 10 Jun 2023 03:11 IST

పత్తాలేని దస్త్రం

ఏళ్లు గడుస్తున్నా తీరు మారని జడ్పీ

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: వార్షిక ఇంక్రిమెంట్ల కోసం జడ్పీ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు.. అసలు ఎప్పుడిస్తారోనని ఆశగా ఉన్నారు.. సదరు దస్త్రం సిద్ధం చేసి తన వద్దకు పంపాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి పలుమార్లు సంబంధిత విభాగాన్ని ఆదేశించినా ఫలితం శూన్యం.. అయితే అసలు ఆ దస్త్రం సిద్ధమైందా? లేదా? అనేది అనుమానమే.. ఫలితంగా గత మూడేళ్లుగా రావాల్సిన ఇంక్రిమెంట్లు జమకాక పోవడంతో జీతాల్లో పెరుగుదల లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్పీ కార్యాలయంలో 45మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. తమ సర్వీస్‌కి గుర్తింపుగా రావాల్సిన వార్షిక ఇంక్రిమెంటు వేయకపోవడం, ఉద్యోగుల బేసిక్‌ వేతనాల్లో పెరుగుదల లేకపోవడంతో ఇప్పటికే రూ.లక్షల్లో నష్టపోయామంటున్నారు. జడ్పీలో పనిచేసే ఉద్యోగికి ఏడాదికి రూ.2వేలు ఇంక్రిమెంట్‌ జమకావాలి. ఆ బేసిక్‌తో కలవడంతో హెచ్‌ఆర్‌ఏ, డీఏలు మొత్తం జమచేసి ఉద్యోగికి జీతం రూపంలో చెల్లిస్తారు. ఇలా రెండేళ్లుగా ఒక్కో ఉద్యోగికి వేలాది రూపాయలు రావాలి. దీనిపై గతంలో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన సీఈవో ప్రభాకరరెడ్డి.. 45మందికి సంబంధించిన దస్త్రాన్ని సిద్ధం చేయాలని ఆదేశించినా అడుగు ముందుకు పడలేదు. ఎందుకింత జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపమా? లేక గతంలో సీఈవో చెప్పినట్లు ఆ దస్త్రం సిద్ధం చేయడం సంబంధిత విభాగానికి అవగాహన లేదా? అనే ప్రశ్నలకు సమాధానం కరవైంది. సాక్షాత్తూ జడ్పీ కార్యాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇక ఉమ్మడి జిల్లాలో దస్త్రాల పరిస్థితి ఏమిటనేది ఆ పెరుమాళ్లకే ఎరుక. ఈ విషయమై జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డిని వివరణ కోరగా ఆ దస్త్రం సిద్ధం చేయాలని సంబంధిత అధికారికి ఇప్పటికే పలుమార్లు చెప్పానన్నారు. బదిలీల ప్రక్రియ ముగిశాక ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని