logo

ప్రవేశాల వేట.. వసతుల మాటో?

పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట జడ్పీ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా మారుస్తూ బాలికలకు ఇంటర్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ, సీఈసీ గ్రూప్‌లు ప్రవేశపెట్టగా కేవలం ఐదుగురు చేరారు.

Updated : 10 Jun 2023 04:05 IST

పూర్తిస్థాయిలో భర్తీ కాని అధ్యాపక పోస్టులు
హైస్కూల్‌ ప్లస్‌ను వెంటాడుతున్న సమస్యలు

శంకర్రాయలపేటలోని హైస్కూల్‌ ప్లస్‌

పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట జడ్పీ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా మారుస్తూ బాలికలకు ఇంటర్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ, సీఈసీ గ్రూప్‌లు ప్రవేశపెట్టగా కేవలం ఐదుగురు చేరారు. వారందరూ సీఈసీని ఎంచుకున్నారు. ఈ ఏడాది 40 మంది విద్యార్థినుల  వివరాలు సేకరించారు. సీఈసీలోనూ ప్రస్తుతం సివిక్స్‌ బోధించే అధ్యాపకులు లేరు. ఎంపీసీలో ఎవరూ చేరరనే ఉద్దేశంతో అధ్యాపకులను ఖరారు చేయలేదు.

వి.కోటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం సీఈసీ గ్రూప్‌ ఒక్కటే అందుబాటులో ఉండగా.. ఆంగ్లం, కామర్స్‌ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడా ఐదుగురే చేరారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో ఏడుగురు మాత్రమే ఉన్నారు.  

ఈనాడు, చిత్తూరు- న్యూస్‌టుడే, పెద్దపంజాణి: పదో తరగతి తర్వాత బాలికలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సమీపంలోని ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్చామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. సర్కారు మాటలు బాగానే ఉన్నా అధ్యాపకుల నియామకం, పాఠ్య పుస్తకాల సరఫరాపై మాత్రం శ్రద్ధ చూపడంలేదు. ఈ ఈ నేపథ్యంలో అధ్యాపకులు ప్రవేశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నా.. తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తే ప్రవేశాలు పెరిగి లక్ష్యం సాధించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 20 హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలు ఉన్నాయి. కేవలం బాలికలకు మాత్రమే హైస్కూల్‌ ప్లస్‌లో ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థినులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే చదువుకోవాలనే లక్ష్యంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమం మంచిదే అయినా ఎటువంటి ముందస్తు సన్నద్ధత లేకుండానే గతేడాది ప్రవేశాలు ప్రారంభించారు. అది కూడా పాఠశాలలు పునః ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది. దీంతో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారే ఎక్కువ మంది చేరారు.

ఇంకా వెతుకులాటే..

గతేడాది జిల్లాలోని 20 హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో 14 చోట్ల కలిపి 219 ప్రవేశాలు మాత్రమే ఉన్నాయి. చౌడేపల్లె, కొత్తపల్లిమిట్ట, పచ్చికాపల్లం, సోమల, వి.కోటలో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ ఏడాది ప్రవేశాలు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో కళాశాలల పునః ప్రారంభానికి ముందే ఈ తంతును ముగించాలని ఇంటర్‌ బోర్డు ఆదేశించినప్పటికీ ఫలితం లేదు.

ఫలితాలు బేరీజు వేసుకుని..

జూన్‌ 1న ఇంటర్‌ తరగతులు మొదలైనప్పటికీ ఇప్పటికీ హైస్కూల్‌ ప్లస్‌లోని ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రవేశాల వేటలోనే ఉన్నారు. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నప్పటికీ వారు ఆసక్తి చూపడంలేదు. ఈ ఏడాది ఇంటర్‌లో హైస్కూల్‌ ప్లస్‌లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని తమ పిల్లలను దగ్గరలోని ప్రైవేటు కళాశాలల్లో చేరుస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనికితోడు పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేకపోవడం మరో సమస్యగా మారింది. మూడు, నాలుగుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించినప్పటికీ సివిక్స్‌, కామర్స్‌, ఆంగ్లం, జంతుశాస్త్రం సబ్జెక్టులను బోధించే అధ్యాపకుల కొరత ఉంది. ఉన్నవారిలో కొందరు తిరిగి తమ సమ్మతిని వెనక్కు తీసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పాత పుస్తకాలతోనే సర్దుకోవాలా?  

మరోవైపు ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నేటికీ ఇవ్వలేదు. నాలుగేళ్లుగా పాత పుస్తకాలోనే నెట్టుకొస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో కూడా అందుబాటులో లేకపోవడంతో సీనియర్‌ విద్యార్థుల నుంచి తీసుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో విద్యార్థినులకు దిక్కుతోచడంలేదు. గతేడాది పుస్తకాల ప్రచురణకు నిధులు ఇవ్వడానికి తితిదే ముందుకు వచ్చినప్పటికీ కొంతకాలం తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదైనా పుస్తకాలు సరఫరా చేస్తే ఇంటర్‌ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని