logo

అనుసంధానిస్తే అపార ప్రయోజనం

నీటికున్న శక్తి అపారం. నీరు లేనిదే మనుగడలేదు.. నిర్వహణ సక్రమంగా చేపడితే అపార ప్రయోజనాలు పొందవచ్చు.. రెండు జిల్లాల్లో ఇందుకు అనేక పథకాలు చేపట్టి ప్రజలకు చేరువ చేశారు.

Updated : 18 Sep 2023 05:29 IST

నేడు నీటి నిర్వహణ దినోత్సవం

గంగ.. తీరేనా.. బెంగ..

నీటికున్న శక్తి అపారం. నీరు లేనిదే మనుగడలేదు.. నిర్వహణ సక్రమంగా చేపడితే అపార ప్రయోజనాలు పొందవచ్చు.. రెండు జిల్లాల్లో ఇందుకు అనేక పథకాలు చేపట్టి ప్రజలకు చేరువ చేశారు. దీంతో నీటిని సక్రమంగా వినియోగించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సక్రమంగా లేక అనుకున్న ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. అధికారులు, నాయకులు చర్యలు తీసుకుంటే నీటి నిర్వహణలో ముందుండి అనుకున్న లక్ష్యాలు చేరుకోగలం.. ఒక్క సారి పరిశీలిస్తే...

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి: కండలేరు నుంచి పూండి జలాశయం వరకు వెళ్లే తెలుగుగంగ తాగునీటితో పాటు ఆయా ప్రాంతంలో పంటలకు సాగునీటిని అందిస్తోంది. అయితే తెలుగుగంగ పరివాహక ప్రాంత రైతుల సౌకర్యార్థం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అనుసంధానంగా నిర్మించిన ఉప కాల్వల అభివృద్ధి కాగితాలకు పరిమితమైంది. దీంతో పూర్తి స్థాయిలో సాగునీరు రైతులకు అందడం లేదు. ప్రస్తుతం కాల్వ నీటిని చెరువులకు అనుసంధానం చేయడంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉపకాల్వలు పూర్తయితే పూర్తి స్థాయిలో లక్ష్యం ఒనగూరే అవకాశముంది. కేవీబీపురంలోని కాళంగి జలాశయానికి తెలుగుగంగకు అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన ఏళ్ల తరబడి కాగితలకే పరిమితమైంది. సూళ్లూరుపేటకు తెలుగుగంగ నీటిని పంపే ప్రణాళికలు ప్రతిపాదన దశల్లోనే ఉండటం గమనార్హం.

శాశ్వత మరమ్మతులు ఏవీ?

పుంగనూరు, న్యూస్‌టుడే: జిల్లాలో అత్యధిక చెరువులు, కుంటలున్న నియోజకవర్గాల్లో పుంగనూరు ఒకటి. ఇక్కడ సాగునీటి కాలువలు, ప్రాజెక్టులు లేవు. దీంతో రైతులు హంద్రీ నీవాపై ఆధార పడ్డారు. ఆ నీళ్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో వర్షాలతోనే వ్యవసాయం. చెరువులు, కుంటల పటిష్ఠత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ గొలుసు విధానంలో చెరువులు, కుంటలను అనుసంధానం చేశారు. చెరువులకు గండిపడటంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారే కానీ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో అనుకున్న ప్రయోజనం చేకూరడం లేదు. చెరువులు, కుంటల ద్వారా నియోజకవర్గంలో 25వేల హెక్టార్లకు సాగునీరు చేరుతుంది. అనుసంధానించక పోవడంతో ఈ భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

లక్ష్యానికి దూరంగా..

పుత్తూరు, న్యూస్‌టుడే: నగరి పట్టణ పరిధిలో ప్రవహిస్తున్న కుశస్థలి నదితో సత్రవాడ, బుగ్గ ప్రాజెక్టులతో రైతులు సిరులు పండిస్తున్నారు. నగరి మీదుగా ప్రవహించే కుశస్థలి నదిపై సత్రవాడ వద్ద చెక్‌డ్యామ్‌ నిర్మించి నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో సుమారు 21 గొలుసుకట్టు చెరువులను ఏటా నింపుతున్నారు. బుగ్గ నుంచి విజయపురం, నగరి, నిండ్ర మండలాల్లోని 16 చెరువులకు నీరు చేరుతోంది. గతంలో కురిసిన వర్షాలకు సత్రవాడ వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌ కొట్టుకు పోయింది. దీంతో ప్రస్తుతం కొన్ని చెరువులకు మాత్రం నీరు చేరుతోంది. మొత్తం సుమారు 5వేల ఎకరాలకు సారు నీరు అందాల్చి ఉండగా ప్రస్తుతం 2వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు చేరుతుంది.

పనులు చేస్తేనే రైతులకు లబ్ధి

పెనుమూరు, న్యూస్‌టుడే: పెనుమూరు మండలం కలవకుంట వద్ద నిర్మించిన ఎన్టీఆర్‌ జలాశయం నుంచి మిగులు నీటి సద్వినియోగానికి చేపట్టిన చెరువుల అనుసంధానంతో రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఏటా భారీ వర్షాలకు మిగులునీరు సముద్రం పాలు కావడంతో ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో అనుసంధానం చేపట్టారు. పెనుమూరు మండలంలో రెండు, జీడీ నెల్లూరు మండలంలో 31 చెరువులకు నీటిని అందించేలా రూపకల్పన చేశారు. గత ప్రభుత్వ హయాంలో గుంగుపల్లె చెరువు వరకు పనులు సాగడంతో ఆయకట్టు భూములు సస్యశ్యామలం అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం రూ.194 కోట్లు నిధులు మంజూరు చేసింది. పెనుమూరు మండలంలోని బలిజపల్లె చెరువు మొరవ పనులు, జీడీనెల్లూరు మండలంలోని నాశంపల్లె చెరువు కట్ట పనులు జరుగుతున్నాయి. 28 చెరువు పనులు చేపట్టాల్చి ఉంది. ప్రస్తుతం గంగుపల్లి చెరువు పరిధిలోని 100 ఎకరాలకు మాత్రమే సాగునీరు చేరుతోంది. ఇంకా 10 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని