హామీలే.. ఏమీలే..!
ఆధ్యాత్మిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశవిదేశాల్లో కీర్తి గడించిన జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించట్లేదన్న విమర్శలున్నాయి.
వరద గాయాలకు ఏదీ ఉపశమనం
ముందుకు సాగని జీఎన్‌ఎస్‌ఎస్
జిల్లాపై దృష్టిసారించని ముఖ్యమంత్రి
ఆధ్యాత్మిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశవిదేశాల్లో కీర్తి గడించిన జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించట్లేదన్న విమర్శలున్నాయి. స్వర్ణముఖి నదిపై కూలిన వంతెనలు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం మొదలు తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్మిస్తున్న జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు వరకు ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొంది. తితిదే ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం భూమార్పిడి ప్రక్రియ పూర్తి చేయలేదు. దీనివల్ల పట్టాలు పొందినా వారికి శాశ్వత హక్కులు కలగని పరిస్థితి ఏర్పడనుంది. వీటితోపాటు జిల్లా పరిధిలోని పలు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఈనాడు-తిరుపతి
జిల్లా పరిధిలో 2021 నవంబరు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖి నదిపై వంతెనలు కుప్పకూలాయి. దెబ్బతిన్న వంతెనలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక వంతెనలు వేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. శాశ్వత ప్రాతిపదికన వంతెనల నిర్మాణానికి అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటి వరకు చర్యలు లేవు. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ శాశ్వత ప్రాతిపదికన వంతెనల నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తి చేయలేదు. వాస్తవానికి ఈ వంతెనలపై నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మళ్లీ అదేస్థాయిలో వరద వస్తే ఉన్న వంతెనలు కుప్పకూలే ప్రమాదం ఉంది. వాస్తవానికి నాడు కురిసిన భారీ వర్షానికి తిరుమల కనుమ మార్గంతోపాటు శ్రీవారి మెట్టు మార్గం ప్రాంతం పెద్ద ఎత్తున దెబ్బతింది. తితిదే యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. ప్రభుత్వం మాత్రం స్వర్ణముఖి నదిపై కూలిన వంతెనల నిర్మాణానికి తాత్సారం చేస్తోంది.
సొసైటీ పేరుతో మారిస్తేనే..
తిరుచానూరు-పాడిపేట మార్గంలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన, పాదిరేడు అరణ్యంలో తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చదును చేస్తున్న భూమి
తితిదే ఉద్యోగులకు పాదిరేడు అరణ్యంలో సుమారు 430 ఎకరాలు సేకరించి ఇళ్ల స్థలాల కింద పట్టాలు అందించనున్నారు. ఇవన్నీ డీకేటీ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. వీటిని సొసైటీ పేరుతో మార్పు చేయాలి. ఆ తర్వాత వ్యవసాయ నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ తుడాకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కూడా భూమార్పిడి ప్రక్రియ చేపట్టాలి. దీనికి తుడాకు అనుమతి ఇచ్చే అధికారం లేనందున ప్రభుత్వానికి నివేదించి అక్కడి నుంచి ఆమోదముద్ర తీసుకోవాలి. ఆ తర్వాతే లేఅవుట్‌కు అనుమతి లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే ఉద్యోగులకు మేలు జరుగుతుంది. డీకేటీ నుంచి సొసైటీ పేరుతో మార్చకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.
జీఎన్‌ఎస్‌ఎస్ పూర్తయ్యేదెన్నడో?
బాలాజీ జలాశయాన్ని పూర్తి చేస్తే తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆస్కారం ఉంది. ఏటా కురిసే వర్షాలతోనే సుమారు ఒక టీఎంసీ నీటిని ఒడిసిపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల కిందట కురిసిన వర్షానికి ఏడు టీఎంసీల నీరు వృథాగా పోయిందని అంచనా వేశారు. తెదేపా హయాంలోనే తొలి దశ అటవీ అనుమతులు లభించాయి. నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ వైకాపా ప్రభుత్వ హయాంలో రెండో దశ అనుమతులు తీసుకురాని దుస్థితి నెలకొంది. బాలాజీ, మల్లెమడుగు జలాశయాలను పూర్తి చేసేందుకు ఇప్పటి వరకు మూడుసార్లు అంచనాలు పెంచుకుంటూ వెళ్లినా ప్రభుత్వం టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపించట్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు