logo

ఆంక్షల వలయంలో తిరునగరి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరం ఆంక్షల వలయంలో చిక్కుకుంది.

Updated : 18 Sep 2023 05:30 IST

వారధి కింద స్తంభించిన ట్రాఫిక్‌..

ఈనాడు-తిరుపతి; న్యూస్‌టుడే, తిరుపతి (తాతయ్యగుంట): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరం ఆంక్షల వలయంలో చిక్కుకుంది. ఆదివారం ఉదయం నుంచే అధికారులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీనివాససేతుపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌ నిలిచి భక్తులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. చివరికి రాత్రి 7.30 గంటల సమయంలో ప్రజల ఒత్తిడి భరించలేక వంతెనలపై రాకపోకలకు అనుమతించారు. సోమవారం ఉదయం మళ్లీ నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో శ్రీనివాససేతును సీఎం సోమవారం ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే బస్టాండు నుంచి అటు అలిపిరి మార్గం, మంగళం వైపు నుంచి అలిపిరి వైపు, అలిపిరి మార్గం వైపు నుంచి శ్రీనివాసం వరకు ఫ్లైఓవర్‌పై రాకపోకలు సాగుతున్నాయి. బస్టాండు నుంచి తిరుచానూరు, రేణిగుంట మార్గాలవైపు వెళ్లే ఫ్లైఓవర్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి అన్ని మార్గాల్లోనూ ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిపివేయడంతో నగరంలో ట్రాఫిక్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అలిపిరి మార్గంలో శ్రీనివాససేతు వంతెన చివరి నుంచి గరుడ సర్కిల్‌ వరకు బారికేడ్లు పెట్టారు. సందులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. నడిచి వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి నెలకొంది. గతంలో సీఎం పర్యటించే కొద్ది గంటల ముందు పోలీసులను ఉంచేవారని,  వెళ్లిపోగానే రాకపోకలు యథావిధిగా సాగేవని.. ఇప్పుడు ఏకంగా బారికేడ్లు అడ్డంపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  
తాతయ్యగుంట ఆలయ దర్శనాల నిలుపుదల: సీఎం తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని సోమవారం దర్శించుకోనున్న నేపథ్యంలో యంత్రాంగం  ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమవారం వినాయకచవితి నేపథ్యంలో ఇక్కడ దుకాణాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తుంది. సోమవారం సాయంత్రం సీఎం పర్యటిస్తుంటే ఆదివారం నుంచే ఆంక్షలు ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ః కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కాని రహదారులు కన్పించకుండా తెరలు ఏర్పాటు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు