logo

అడిగేదెవరని.. చెక్‌డ్యామ్‌ కూల్చేశారు!

నూతనంగా చిత్తూరు-తచ్చూరు ఆరు వరుసల రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి.. చిత్తూరు పరిధిలోని ఎల్‌బీపురం, నరిగపల్లె, దిగువమాసాపల్లె తదితర గ్రామాల సమీపంలో ఈ రహదారి వెళ్తోంది.

Published : 22 Sep 2023 02:41 IST

ఇష్టారాజ్యంగా జలవనరుల ధ్వంసం
చిత్తూరు-తచ్చూరు రహదారి పనుల తీరు

చెక్‌డ్యామ్‌ కూల్చివేసిన దృశ్యం

చిత్తూరు (మిట్టూరు),   న్యూస్‌టుడే: నూతనంగా చిత్తూరు-తచ్చూరు ఆరు వరుసల రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి.. చిత్తూరు పరిధిలోని ఎల్‌బీపురం, నరిగపల్లె, దిగువమాసాపల్లె తదితర గ్రామాల సమీపంలో ఈ రహదారి వెళ్తోంది.. నూతన రహదారి నిర్మాణ సమయాన చెరువులు, వాగులు, వంకలు, కుంటలను అలానే ఉంచాలి.. వాటి రూపురేఖలు మార్చరాదనే సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా ఇష్టారీతిన ఆయకట్టు భూములకు నీరందించే కాలువలు పూడ్చివేయడం, చెక్‌డ్యామ్‌ ధ్వంసం చేస్తున్నా రంటూ ఎల్‌బీపురం, చెరువుముందరవూరు, బండపల్లె తదితర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు-తచ్చూరు రహదారి ఎల్‌బీపురం, బండపల్లె తదితర గ్రామాలకు చెందిన పొలాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో ఎల్‌బీపురం పాత చెరువు మొరవ కాలువ మీద 20 ఏళ్ల కిత్రం చెక్‌డ్యామ్‌ నిర్మించారు. దీని ద్వారా అధికంగా నీరు నిల్వ చేస్తారు. ఆ 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. ఇలా లాభదాయకంతో పాటు బోర్లలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేందుకు ఎంతో దోహదపడుతోంది. నీటి వనరుల సామర్థ్యం ఉన్న ఈ చెక్‌డ్యామ్‌ను గుత్తేదారులు అర్ధాంతరంగా కూల్చేశారు. అది ఉన్నచోట పడిపోయిన నాపరాళ్లు దర్శనమిస్తున్నాయి. అసలు దీన్ని ఎందుకు కూల్చేశారనే విషయమై ఎవరికీ సమాచారం లేదు. అదేమిటని అడిగే నాథుడే లేకపోవడంతో పనులు ఇష్టారీతిన సాగుతున్నాయి. కూల్చేసిన చెక్‌డ్యామ్‌ పునరుద్ధరించాలని నేషనల్‌ హైవే అధికారులకు తెలియజేసినా స్పందన కరవైంది. కనీసం తమ గోడు ఆలకించలేదని, తమ సమస్య ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

రెండు కాలువలు పూడ్చివేత..

ఎల్‌బీపురం కొత్త చెరువును ఆనుకుని ఈ రహదారి వెళ్తుంది. కొత్త చెరువుకు పెద్ద వంక నుంచి వరద వెళ్లేందుకు అనువుగా ఉన్న కాలువను రోడ్డు పనుల్లో భాగంగా పూర్తిగా పూడ్చేశారు. ఈ క్రమంలోనే చెరువు మొరవ కాలువను పూడ్చివేసి రూపురేఖలు మార్చేశారు.  చెక్‌డ్యామ్‌ ధ్వంసమై..  కాలువలు పూడిపోయి ఆ ప్రాంతం అధ్వానంగా మారిం ది. పూడ్చివేసిన కాలువల పునరుద్ధరణ పనుల గురించి అధికారులు సైతం పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.


పునరుద్ధరించకపోతే కేసు

పూడ్చివేసిన కాలువలు, ధ్వంసం చేసిన చెక్‌డ్యామ్‌ వెంటనే పునరుద్ధరించకుంటే సంబంధిత గుత్తేదారులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు.  

విజయకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని