logo

పోటీకెళ్తే పతకమే

ప్రయత్నం చేస్తే అసాధ్యమేమీ లేదని నిరూపించారు ఈ విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిచ్చర పిడుగులు తమ సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు..

Published : 22 Sep 2023 02:41 IST

చదువు, సహ పాఠ్యాంశాల్లో ప్రతిభ
రాణిస్తోన్న విద్యార్థులు

న్యూస్‌టుడే, చిత్తూరు(క్రీడలు) : ప్రయత్నం చేస్తే అసాధ్యమేమీ లేదని నిరూపించారు ఈ విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిచ్చర పిడుగులు తమ సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.. ఒకవైపు విద్య, మరోవైపు సహ పాఠ్యాంశాల్లోనూ చక్కటి ప్రతిభ చూపి తమ ప్రత్యేకత నిరూపించు కున్నారు.. వీరు పోటీకెళ్తే పతకం సాధించి తీరాల్సిందే.. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాల్ని సాధించేలా అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


సైకిల్‌ సవారీతో పతకం..

పదో తరగతి చదువుతున్న అనుష్కకు క్రీడలంటే ఆసక్తి. చిత్తూరు నగరానికి చెందిన తను సంతపేటలోని నగరపాలక పాఠశాలలో చదువుతోంది. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయినా పేదరికం ఆ విద్యార్థినికి అడ్డుకాలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అడుగేసింది. అందుకే అనుకున్న విభాగంలో చక్కగా రాణిస్తోంది. సైకిల్‌ తొక్కడం అనుష్క దినచర్యలో భాగం. సైక్లింగ్‌ పోటీల గురించి తెలుసుకున్న తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోటీల బరిలో నిలిచింది. అలా గతేడాది అండర్‌-17 జిల్లా స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకాన్ని ఇట్టే కైవసం చేసుకుంది. త్వరలో జరిగే జోనల్స్‌ పోటీల్లోనూ సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.


భళా కృతిక్‌..

కృతిక్‌ రోషన్‌ చిత్తూరులోని వరదప్పనాయుడు నగరపాలకోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువులో ఈ విద్యార్థి ఎంతో చురుకు. జిల్లా గ్రంథాలయ సంస్థ, రచయితల సంఘం, గురజాడ ఫౌండేషన్‌ సాహితీ సంస్థలు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పలు పతకాలు గెలుచుకున్నాడు. ఆర్ట్స్‌ అకాడమీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో రజత పతకాన్ని గెలిచాడు. త్వరలో జరిగే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం తన లక్ష్యం అంటున్నాడీ నిత్య విద్యార్థి.


వ్యర్థానికి కొత్త అర్ధం..

కాగిత వ్యర్థాలకు కొత్త అర్థాన్నిస్తోంది చిత్తూరు మండలం తుమ్మింద జడ్పీ పాఠశాలలో చదువుతోన్న పదో తరగతి విద్యార్థిని రేవతి. అమ్మ స్ఫూర్తితో చేతివృత్తి కళలపై ఆసక్తిని పెంచుకుందీ విద్యార్థిని. పాఠశాలలో క్రాఫ్ట్స్‌పై అందించే శిక్షణలో చేరింది. కాగితాలతో ఫొటో ఫ్రేమ్‌, పువ్వులు, గోడలకు అలంకరణగా ఏర్పాటుచేసే డిజైన్లు తయారుచేసింది. తాను తయారుచేసిన ఉత్పత్తుల్ని ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రదర్శించడం తన లక్ష్యమంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని