logo

విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఇంటి నుంచి ఈ నెల 17న వెళ్లిపోయిన విద్యార్థిని భవ్యశ్రీ(16) బుధవారం రాత్రి బావిలో శవమై తేలింది. ఎస్సై అనిల్‌కుమార్‌ కథనం మేరకు..

Published : 22 Sep 2023 02:41 IST

హత్యేనని కుటుంబీకుల ఆరోపణ

భవ్యశ్రీ(పాతచిత్రం)

పెనుమూరు, న్యూస్‌టుడే: ఇంటి నుంచి ఈ నెల 17న వెళ్లిపోయిన విద్యార్థిని భవ్యశ్రీ(16) బుధవారం రాత్రి బావిలో శవమై తేలింది. ఎస్సై అనిల్‌కుమార్‌ కథనం మేరకు.. మండలంలోని ఠాణావేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మావతి దంపతుల కుమార్తె భవ్యశ్రీ ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు వినాయకుడి విగ్రహాన్ని బుధవారం రాత్రి సమీప బావిలో నిమజ్జనం నిమిత్తం వేశారు. అది విగ్రహం మునిగిందా? లేదా? అని చూసేందుకు బావిలోకి లైటు వేసి చూడగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వెలికి తీశారు. కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెది హత్యేనని, కొందరు యువకులపై అనుమానం ఉందని అంటున్నారు. ఇంటి నుంచి వెళ్లే ముందు రోజు ఓ యువకుడితో ఫోనులో మాట్లాడినట్లు తెలుస్తోంది. గతంలోనూ కొందరు మాట్లాడినట్లు చెప్పడంతో వారినీ పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


విద్యుదాఘాతంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌..

రజనీకాంత్‌(పాతచిత్రం)

గంగవరం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని ఓంశక్తి ఆలయ సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పలమనేరు రూరల్‌ మండలం వడ్డూరుకు చెందిన రజనీకాంత్‌(20) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆలయం పక్కన ఉన్న వ్యవసాయ భూమికి మట్టిని తోలుతున్నాడు. సాయంత్రం మట్టినిదింపే సమయంలో ట్రాలీకి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో ట్రాక్టర్‌లో ఉన్న రజనీకాంత్‌ విద్యుదాఘాతానికి గురై పక్కన ఉన్న వ్యవసాయబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్యడంతో సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సుమారు రెండు గంటలు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. శవపరీక్షల నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అప్పుల బాధతో వ్యక్తి ...

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో సెల్వం(35) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గురువారం వారు ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తానికి చెందిన ఇతను ఇటీవలే పట్టణానికి వచ్చి కాపురం పెట్టినట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


నాలుగు డెంగీ కేసుల నమోదు

తవణంపల్లె: మండల పరిధిలోని తొడతర, క్రిష్ణాపురం, దిగువమాఘం, చారాల గ్రామాల్లో ఒక్కోటి చొప్పున నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.


4.4 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

వడమాలపేట, న్యూస్‌టుడే: అక్రమంగా నిల్వ ఉంచిన 4.4 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం తెల్లవారుజామున తిరుపతి విజిలెన్స్‌ అధికారుల సహకారంతో వడమాలపేటలో దాడులు నిర్వహించామని చెప్పారు. స్థానిక సుధాకర్‌ రైస్‌ మిల్లు పక్కనున్న గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందన్నారు. అనంతరం అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఈశ్వర్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని