logo

జగనన్న కాలనీలు.. బోసిపోతున్న గృహాలు

జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు తిప్పలు ఎదురవుతున్నాయి. ఇళ్లను నిర్మిస్తున్న గుత్తేదారులు ప్రభుత్వం మంజూరు చేసే నగదు కాకుండా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి అదనంగా వసూలు చేసి శ్లాబ్‌ పూర్తి చేశారు.

Published : 22 Sep 2023 02:41 IST

తలుపులు, కిటికీలకు అదనపు వసూళ్లు
గుత్తేదారుల ఒత్తిడితో బోరుమంటున్నలబ్ధిదారులు

శ్రీకాళహస్తి మండలం మద్దిలేడు మార్గంలో అర్ధాంతరంగా ఆగిన ఇళ్ల నిర్మాణం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు తిప్పలు ఎదురవుతున్నాయి. ఇళ్లను నిర్మిస్తున్న గుత్తేదారులు ప్రభుత్వం మంజూరు చేసే నగదు కాకుండా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి అదనంగా వసూలు చేసి శ్లాబ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం తలుపులు, కిటికీలు, ద్వారబంధాల ఏర్పాటుకు మళ్లీ డబ్బులు కావాలంటూ ఒత్తిడి తెస్తుండటంతో లబ్ధిదారుల ఇవ్వలేమని తేల్చి చెబుతునన్నారు. దీంతో వారు ఎక్కడి నిర్మాణ పనులు అక్కడే అర్ధాంతరంగా నిలిపివేయడంతో గృహాలు తలుపులు, కిటికీలు లేకుండా కళావిహీనంగా కనిపిస్తున్నాయి.

శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు గ్రామం వద్ద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా జగనన్న కాలనీలకు ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే. సెంటు స్థలంలో రూ.1.80 లక్షలతో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదనంగా మరో రూ.30 వేలు రుణ సదుపాయం ఇస్తానంది. గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు గుత్తేదారుల సహకారంతో నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో గుత్తేదారుడు వందల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు లబ్ధిదారుల ఖాతాల నుంచి గుత్తేదారులు తీసుకుంటున్నారు.

పనులు పూర్తి కాకుండానే డ్రా..

పనులు పూర్తికాకనే ముందస్తుగా పలువురు గుత్తేదారులు నగదు తీసుకున్నారు. ఇంకా సిమెంటు పూతలతో పాటు మరుగుదొడ్లు నిర్మించి, కిటికీలు, ద్వారబంధాలు, తలుపులు అమర్చాల్సి ఉంది. ఈ పనులు పూర్తికావాలంటే అదనంగా లబ్ధిదారులు డబ్బులు ఇవ్వాలంటూ పలువురు గుత్తేదారులు ఒత్తిడి తేవడంతో పేదల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దీంతో ఇల్లు లేకున్నా ఫర్వాలేదని.. అప్పులు చేస్తే ఎలా తీర్చాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఊరందూరులోని జగనన్న కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీలోని జగనన్న లేఔట్లలోనూ ఇదే పరిస్థితి.

సొంతింటి కల తీరక..

అధికారులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లబ్ధిదారులకు అవస్థలు తప్పలేదు. డబ్బులు ఇవ్వని కారణంగా పలు గృహాల పురోగతిని గుత్తేదారులు పట్టించుకోలేదు. దీంతో నిర్మాణంలో ఉన్న గృహాలను పిచ్చిమొక్కలు కమ్మేయడంతో సొంతింటి కలపై లబ్ధిదారులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి  కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని