logo

సమావేశాలు సరే.. భవనాలేవీ?

చిత్తూరు జిల్లాలో మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, భవిష్య ప్రణాళికలు వేసుకోవడం కోసం ప్రత్యేక సమావేశ భవనాలు లేవు. ఈ సంఘాల వారు వారి పరిధిలోని మున్సిపల్‌ కార్యాలయాల సమీపంలో ఎక్కడో ఒకచోట కూర్చుని సమావేశాలు నిర్వహిస్తుంటారు.

Published : 27 Sep 2023 06:27 IST

ఇబ్బంది పడుతున్న మహిళా సంఘాల సభ్యులు

పలమనేరులో కారుషెడ్డులోనే సమావేశం

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలో మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, భవిష్య ప్రణాళికలు వేసుకోవడం కోసం ప్రత్యేక సమావేశ భవనాలు లేవు. ఈ సంఘాల వారు వారి పరిధిలోని మున్సిపల్‌ కార్యాలయాల సమీపంలో ఎక్కడో ఒకచోట కూర్చుని సమావేశాలు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహించే సమావేశాల కోసం వీరికి ప్రత్యేక భవనాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే ఎక్కడా అలాంటి నిర్మాణాలు లేవు.

  • చిత్తూరులో మాత్రం మున్సిపల్‌ ఆవరణలోని ఒక భవనంలో తాత్కాలికంగా వీరు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇక పలమనేరు పట్టణంలో నిర్మించిన ఒక భవనం నిరుపయోగంగా ఉంది. పట్టణానికి సమీపంలో రూ.25 లక్షలతో స్త్రీనిధి భవనం పేరిట నిర్మాణం చేపట్టారు. గతేడాదే ఈ భవనాన్ని పూర్తి చేసి గుత్తేదారు అధికారులకు అప్పగించాల్సి ఉంది. కొన్ని చిన్న చిన్న పనులు పూర్తవకపోవడంతో భవనాన్ని అలాగే వదిలేశారు. అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఈ భవనం వృథాగా దర్శనమిస్తోంది. మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవారికి ఆవాసంగా ఉపయోగపడుతోంది.

జిల్లాలో ఎక్కడెక్కడ లేవంటే.. జిల్లాలోని పుంగనూరు, కుప్పం, పలమనేరు, నగరి పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో నడిచే మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకునే ప్రత్యేక భవన వసతి లేదు. వీరు ప్రతి నెల సమావేశాలను ఆయా మున్సిపల్‌ కార్యాలయాల ఆవరణలో లేదా ఆరుబయట నిర్వహించుకోవాల్సి వస్తోంది. జిల్లా, పట్టణ సమాఖ్యల సమావేశాలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు కూడా వీరు కలవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడో ఒక ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేసుకోవాలి. పలమనేరు పట్టణంలో అయితే ఒకటి, రెండు సంఘాల వారు సమావేశాలు నిర్వహించాలంటే.. మున్సిపల్‌ కార్యాలయంలోని కారు షెడ్డు వద్ద కూర్చుంటారు.

నిధులు లేక.. పెద్ద సంఖ్యలో సభ్యులు, సంఘాలున్నా కనీసం సమావేశపు హాలు వసతి లేకపోవడం గమనార్హం. ఇందుకోసం ప్రత్యేక నిధులు సంబంధిత మెప్మా విభాగానికి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ భవనాలు నిర్మించాల్సి ఉంది. అయితే వీరి గురించి పట్టించుకునే వారు లేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

  • ప్రత్యేకంగా నిధులు లేకపోవడంతో నిర్మించలేకపోతున్నామని మెప్మా పీడీ రాధమ్మ చెప్పారు. అన్నిచోట్లా మున్సిపల్‌ కార్యాలయాల అధీనంలోని భవనాల్లో తాత్కాలికంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు