logo

పర్యాటకానికి వారధి.. ఏరీ సారథి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగం పడకేసింది. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేసిన ప్రస్తుత సర్కారు.. కొత్త  ప్రతిపాదనలు రూపొందించి వాటినీ మూలన పడేసింది.

Updated : 27 Sep 2023 06:39 IST

అవకాశాలున్నా పడకేసిన పర్యాటకం
అభివృద్ధిపై దృష్టిసారించని మంత్రి

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాలలో అర్ధాంతరంగా నిలిచిన ఎకో టూరిజం ప్రాజెక్టు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగం పడకేసింది. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేసిన ప్రస్తుత సర్కారు.. కొత్త  ప్రతిపాదనలు రూపొందించి వాటినీ మూలన పడేసింది. నాలుగేళ్ల వైకాపా పాలనలో ఈ రంగంలో సాధించిన ప్రగతి శూన్యమే. మూడు నెలల క్రితం సీఎం జగన్‌  తిరుపతిలో 7 స్టార్‌ హోటల్‌కు వర్చువల్‌గా భూమిపూజ చేసినా ఇది కేవలం ధనవంతులు బస చేయడానికే ఉపయోగపడుతుంది. పర్యాటక శాఖ మంత్రి రోజా జిల్లా నుంచి ప్రాతినిధ]్యం వహిస్తున్నా ఆమె మాటలకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే,తిరుపతి(నగరపాలిక): ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరుగాంచింది. పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రామకుప్పం మండలంలోని ననియాలలో తెదేపా హయాంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అప్పట్లో ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం రూ.2 కోట్లతో చేపట్టారు. మరికొన్ని వసతులు కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వీటికి నాలుగేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ప్రాజెక్టు నిస్తేజంగా మారింది. ఇదే మండలంలోని చెలిమిచేను జలపాతం, బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌, పలమనేరు మండలంలోని గంగనశిరస్సు జలపాతాలకు సరిగా రోడ్డు వసతి లేదు. పెనుమూరు మండలంలోని పులిగుండును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని పలుమార్లు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించినా అమలుకాలేదు. జిల్లాకో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి రోజా గతంలో చెప్పారు. ఐరాల మండలంలో భూసేకరణ చేయాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

భవనం ఉన్నా.. అద్దెల భారం

తిరుపతిలో రుయా ఆసుపత్రి ఎదుట ఎకరం స్థలంలో 2013లో రూ.17 కోట్ల అంచనాలతో పర్యాటకశాఖ బహుళ ప్రయోజనాల్ని కాంక్షిస్తూ హరిత హోటల్‌ భవన సముదాయం నిర్మాణం చేపట్టింది. అందులో 110 గదులు, 200 మంది సామర్థ్యం గల హోటల్‌, అత్యాధునికమైన సమావేశ మందిరం, పర్యాటకశాఖ డివిజన్‌ కార్యాలయం, కేంద్రీయ విచారణ కార్యాలయం ఉండేలా భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే రూ.11 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.7కోట్లు వెచ్చిస్తే 2015లోనే నిర్మాణం పూర్తయ్యేది. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పెరిగిన అంచనాల ప్రకారం రూ.15 కోట్లు వెచ్చిస్తే పర్యాటకశాఖకు అత్యాధునిక భవనం సమకూరుతుంది. భవనం అందుబాటులోకి వస్తే పర్యాటకశాఖకు అద్దెల భారం నుంచి విముక్తి లభించడంతో పాటు నెలకు రూ.7 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.

తీర ప్రాంతాల్లో భూములు కేటాయించినా..

తిరుపతి జిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగా జలపాతాలు ఉన్నాయి. వారాంతాల్లో తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. పుత్తూరు మండలంలో మూలకోన, నారాయణవనంలో కైలాసకోన, నాగలాపురంలో సద్దికూటిమడుగు, భూపతేశ్వరకోన, వరదయ్యపాళెంలో ఉబ్బలమడుగు, కేవీబీపురంలో ఆరె, వడమాలపేట, ఏర్పేడు పరిధిలో సదాశివకోన జలపాతాలు ఉన్నా వెళ్లేందుకు మార్గాలు సక్రమంగా లేవు. ఎర్రావారిపాళెంలో ప్రసిద్ధిగాంచిన తలకోన జలపాతం ఉన్నా సౌకర్యాల కొరత వేధిస్తోంది. వాకాడు మండలం తూపిలిపాళెంలో రిసార్ట్‌, అతిథి గృహాల నిర్మాణానికి 16 ఎకరాలు కేటాయించినా పనులు జరగడంలేదు. తడ మండలంలోని ఇరకం దీవిని అభివృద్ధి చేస్తామని మంత్రి, ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఆచరణలోకి రాలేదు. ఇందుకు సంబంధించి పర్యాటకాభివృద్ధి సంస్థకు భూములు కేటాయించినా ఫలితం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని